ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను హైదరాబాద్లోనిచిక్కడ పల్లి పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఈ వ్యవహా రం రెండు తెలుగు రాష్ట్రాలలోని మెగా అభిమానులను తీవ్రంగా కలచి వేసింది. శుక్రవారం ఉదయం పోలీసులు అర్జున్ను తన నివాసం నుంచి స్టేషన్‌కు తీసుకువెళ్లడం.. అక్కడే సంతకాలు చేయించుకుని.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అటు నుంచి కోర్టులో హాజరు పరచనున్నారు.
ఇదిలావుంటే.. అసలు ఈ వ్యవహారం మొత్తానికి కారణం.. ఈ నెల 4న రాత్రి.. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణం. దీనికి సంబంధించి.. అర్జున్ సహా.. పుష్ప -2 యూనిట్ తమకు ముందస్తు సమాచారం లేకుండానే.. థియేటర్ వద్దకు వచ్చారని.. అందుకే తాము.. సెక్యూరిటీ పెంచలేక పోయామనిపోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అర్జున్‌పై కేసు నమోదు చేశారు. అరెస్టు కూడా జరిగింది.
అయితే.. ఇప్పుడు సంధ్య ధియేటర్ యాజమాన్యం సంచనల విషయాన్ని బయట పెట్టింది. తాము ప్రీమియర్ షో వేయడానికి రెండు రోజుల ముందే పోలీసుల అనుమతి కోరుతూ లేఖ రాశామని.. దీనిని చిక్కడ పల్లి పోలీసులకు అందించగా.. వారు సైతం దీనిని ధ్రువీకరించారని పేర్కొంటూ.. సంబంధిత లేఖను మీడియాకు విడుదల చేసింది. దీనిపై ఈ నెల 2వ తేదీ వేసి ఉండడం.. 4వ తేదీన సినిమా ప్రీమియర్ షోను రాత్రి 9.30కు ప్రదర్శిస్తున్నట్టు స్పష్టం చేయడం రాసి ఉంది.
అంతేకాదు.. పోలీసులకు పుష్ప 2 యూనిట్‌లోని.. హీరో, హీరోయిన్ వంటి వారు వస్తున్నారని కూడా స్పష్టం చేశారు. తగిన భద్రత కల్పించాలని కూడా అందులో కోరారు. దీనిపై చిక్కడ పల్లి పోలీసులు సంతకం చేయడంతోపాటు స్టాంపు కూడా వేశారు. కాబట్టి.. ముందస్తు సమాచారం లేకుండా వచ్చారన్న పోలీసుల వాదన వీగిపోతోంది. పోలీసులు సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే.. తొక్కిసలాట జరిగినట్టు స్పష్టమవుతోంది. మరి దీనికి పోలీసులు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.