అక్కడెక్కడో ఉన్న స్ఫూర్తిని గూగుల్ లో వెతికి మరీ పట్టుకొని.. మా గొప్ప అంటూ స్ఫూర్తిగా తీసుకుంటాం. ఆ మాటకు వస్తే.. చుట్టూ చాలామంది ఉన్నా పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే.. స్ఫూర్తి తీసుకోవాలంటే ఓ స్థాయి ఉండాలన్న భావన అంతకంతకూ పెరిగిపోవటమే. స్ఫూర్తివంతులకు ఇమేజ్ ఉండాలని నమ్మేటోళ్లు తక్కువేం కాదు. మారిన కాలంతో పాటు.. మనోళ్లు చెలరేగిపోతున్నారు. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. తమలోని టాలెంట్ ను ప్రదర్శిస్తున్నారు. ఆ కోవలోకే వస్తారు కోణం సాందీప్.
ఇప్పటివరకు ఎవరికి పెద్దగా తెలీని ఈ నల్గొండ కుర్రాడు ఇప్పుడు ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. దీనికి కారణంగా అతడి పేరు తాజాగా విడుదల చేసిన ఫోర్బ్స్ జాబితాలో ఉండటమే. ఈ నెల ఒకటిన ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన అండర్ 30 టెన్త్ యానివర్సరీ లిస్టులో టాప్ 30లో మొదటి వరుసలో నిలిచారు. ఇంతకూ అతను ఏం చేశాడు? ఎందుకంత ప్రాధాన్యత లభించిందన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
అమెరికాలో ఉండే ఈ తెలుగు కుర్రాడు అబ్రిడ్జ్ అనే పేరుతో ఒక యాప్ క్రియేట్ చేశాడు. హెల్త్ కేర్ కు సాయం చేసే ఈ యాప్.. కరోనా సమయంలో కీలకభూమిక పోషించిందని చెబుతున్నారు. అంతేకాదు.. ఇతని కంపెనీకి ఇప్పటివరకు 15 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. డాక్టర్ శివరావ్ తో కలిసి రూపొందించిన అబ్రిడ్జ్ యాప్ అమెరికాలో బాగా ఫేమస్ అయ్యింది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తి చేసిన ఇతడు.. అమెరికాలోని కార్నెగీ మెలన్ వర్సిటీలో రోబోటిక్స్ లో ఎంఎస్ పూర్తి చేశాడు.
ఇప్పటికే పలు డ్రోన్లు.. రోబోటిక్స్ రంగంలో పలు ఆవిష్కరణలు చేసిన ఇతను.. ఇప్పటికే పలు యాప్ లను రూపొందించాడు. కేవలం పాతికేళ్ల వయసులోనే అమెరికా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవటం చిన్న విషయం కాదు. మనోడు మరింత ముందుకు వెళ్లాలని.. మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకోవటమే కాదు.. మనోళ్లకే కాదు.. అందరికి స్ఫూర్తివంతంగా నిలవాలని ఆశిద్దాం.