ఏపీలో జగన్ పగ్గాలు చేపట్టాక ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇసుక దందాకు వైసీపీ నేతలు తెరతీశారని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి ఈ దందాకు సూత్రధారి అని విమర్శలు గుప్పించారు. అయితే, ఇసుక అమ్మకాల కోసం తాము పారదర్శకంగా టెండర్లు పిలిచామని. జయప్రకాష్ పవర్ వెంచర్స్ కు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్ టీసీ ద్వారా బిడ్ లు పిలిచామని, ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని పెద్దిరెడ్డి గతంలో వివరణ ఇచ్చారు.
అయితే, వైసీపీ నేతలు తమకు అనుకూలంగా ఇసుక వ్యాపారాన్ని మార్చుకున్నారని, దివాలా తీసిన కంపెనీకి శాండ్ స్మగ్లర్ పెద్దిరెడ్డి ద్వారా ఇసుక వ్యాపారాన్ని కట్టబెట్టారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. అయితే, ఎంఎస్ టీసీ అనేది ఒక ఈ కామర్స్ ప్లాట్ ఫాం మాత్రమే అని , ఇసుక అమ్మకాల టెండర్లు, బిడ్లకు సంబంధించిన గైడ్ లైన్స్ తో ఎంఎస్ టీసీకి సంబంధం ఉండదని పెద్దిరెడ్డి బుకాయించారు.
ఈ నేపథ్యంలో తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా ఆధారాలతో సహా పెద్దిరెడ్డి గుట్టురట్టు చేశారు పట్టాభి. ఇసుక అమ్మకాలకు సంబంధించి బిడ్, టెండర్ల గురించిన విధివిధానాలు రూపొందించింది ఎవరు అని తాను ఎంఎస్ టీసీని సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించానని పట్టాభి వెల్లడించారు. ఇసుక టెండర్లు, టెక్నికల్ బిడ్ లకు సంబంధించిన గైడ్ లైన్స్ ను తాము రూపొందించలేదని ఎంఎస్ టీసీ అడిషనల్ జనరల్ మేనేజర్ మలాయన్ మండల్ తనకు సమాధానమిచ్చారని పెద్దిరెడ్డి గుట్టురట్టు చేశారు పట్టాభి.
ఇసుక టెండర్లపై జగన్ రెడ్డి నాటకం, కుట్ర బట్టబయలైందని, ఇపుడు ఏం సమాధానం చెబుతావు పెద్దిరెడ్డి అని పట్టాభి నిలదీశారు. ముందుగానే జయప్రకాష్ పవర్ వెంచర్స్ కు టెండర్లు కట్టబెట్టి నాటకాలాడారని దుయ్యబట్టారు. వయసు మీదపడ్డా శాండ్ స్మగ్లర్ పెద్దిరెడ్డి సిగ్గులేకుండా…మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.
ఏసీబీ, సీఐడీని పెద్దిరెడ్డి ఇంటికి పంపాలని, వేల కోట్ల రూపాయల ఇసుక స్కామ్ లో పెద్దిరెడ్డిని విచారణ జరిపి అరెస్టు చేసే దమ్ముందా అని ఏసీబీ, సీఐడీ అధికారులకు పట్టాభి చాలెంజ్ విసిరారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే తనపై భౌతిక దాడులు చేశారని ఆరోపించారు. టీడీపీ ఆధారాలుంటేనే ఆరోపణలు చేస్తుందని, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా తాను ఆధారాలతో సహా ఇంకా అనేక విషయాలు వెల్లడిస్తానని, వైసీపీ నేతలకు భయపడనని పట్టాభి సవాల్ విసిరారు.