ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే ‘కొత్త ఇసుక విధానం’ అంటూ అప్పటిదాకా ఉన్న ఉచిత ఇసుక పాలసీని నిలిపివేశారు. ఏడాదికిపైగా ఇసుక దొరక్కుండా చేసి లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికుల ఉసురు తీసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఇసుక రీచ్‌లను ఒకే ఒక్కరికి అప్పగిస్తూ ఆయన తెచ్చిన ఇసుక విధానం మే 13వ తేదీతోనే ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం కొత్తగా ఎవరికీ కాంట్రాక్టు ఇవ్వలేదు. టెండర్లు పిలవలేదు.
గతంలోలాగా ఉచిత పాలసీ కూడా అమలులో లేదు. మరి.. వేలు, లక్షల లారీల ఇసుక తరలిపోతోంది. ఆ ఆ ఆదాయం ఎవరికి పోతోంది? కనీవినీ ఎరుగని విధంగా పట్టపగలు ఇసుక దోపిడీ జరుగుతోంది. పర్యావరణం పట్టడంలేదు. ప్రభుత్వానికి ఆదాయం లేదు. వచ్చేదంతా ప్రభుత్వ పెద్దలకు, వైసీపీ నేతలకే! ఇది చరిత్రలో ఎవరూ ఎరుగని ‘తాడేపల్లి ఇసుక పాలసీ’!
ఎప్పుడో ముగిసినా…
జగన్ సర్కారు రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లన్నింటినీ జేపీ సంస్థకు అప్పగిస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది. పేరుకు ‘కేంద్రీకృత’ వ్యవస్థే అయినప్పటికీ ఎవరికి వారు ఇసుక తవ్వుకుపోతుండడంతో సదరు సంస్థ చేతులెత్తేసింది. మే 13వ తేదీతో కాంట్రాక్టు గడువు ముగిసిపోవడంతో రాష్ట్రం నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొత్త ఏజెన్సీని ఎంపిక చేయాలి. లేదా… కొత్త పాలసీని ప్రకటించాలి. కానీ… ఇవేవీ చేయలేదు. జిల్లాల వారీగా ఇసుక రీచ్‌లను కట్టబెట్టేశారు. అదికూడా… ‘ఇన్నాళ్లూ తినడానికేం దొరకడంలేదని వాపోతున్నారు కదా!
మీకు కావాల్సినంత ఇసుక తవ్వుకుని అమ్ముకోండి. మాకు నెలకు రూ.15 కోట్లు ఇస్తే చాలు’ అంటూ ఆఫర్ ఇచ్చారు. ముందుకు వచ్చిన నేతలకు నదులు, వాగులు ‘రాసిచ్చేశారు’. అంతే.. స్థానిక నేతలు చెలరేగిపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ ఇసుక తవ్వేస్తున్నారు. యంత్రాలతో ఇసుక తవ్వొద్దన్న నిబంధనకు పాతరేశారు. చివరికి… నదీ గర్భంలో డ్రెడ్జింగ్ ద్వారా కూడా తోడేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రోజుకు రూ.6 కోట్ల విలువైన ఇసుకను తవ్వుకుంటున్నట్లు ఒక అంచనా! నిజానికి… కొత్తగా అనుమతులు ఇచ్చేదాకా ఇసుకను తవ్వొద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా విచ్చలవిడి ఇసుక తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా పట్టించుకోవడంలేదు.
ఖజానాకు చిల్లు
గతంలో ఇసుక విధానం ద్వారా ఖజానాకు ప్రతి నెలా రూ.10 కోట్ల చొప్పున జీఎస్టీ రూపంలో ఆదాయం వచ్చేది. అంటే… నాలుగు నెలల్లో సర్కారుకు 40 కోట్ల ఆదాయం పోయినట్లే. ఇక… గనుల శాఖకు రాయల్టీ కూడా రావడంలేదు. అదే సమయంలో రోజుకు రూ.6 కోట్ల చొప్పున ఇప్పటికే రూ.720 కోట్ల విలువైన ఇసుకను తవ్వేసుకున్నారు. ఆ మేరకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ పెద్దల సొంత జేబులు నిండుతున్నాయి. సగటున ఒక్కో ఉమ్మడి జిల్లా నుంచి ప్రతినెలా సగటున రూ.15 కోట్లు వసూలవుతోంది. ఇసుక రీచ్‌లు ఎక్కువగా ఉన్న చోటా కొత్త జిల్లాల వారీగా ‘కాంట్రాక్టు’ అప్పగించారు.
‘మాకు ఇవ్వాల్సింది ఇస్తే చాలు. ఆపైన మీ ఇష్టం’ అని గేట్లు ఎత్తేయడంతో.. జిల్లాల్లో ఎడాపెడా ఇసుకను తవ్వేస్తున్నారు. గతంలో పోలీసులు, సెబ్ అధికారులు, మైనింగ్ సిబ్బంది హడావుడి చేస్తూ ‘ఇసుక అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం’ మోపేవాళ్లు. ఇప్పుడు వారెవరూ పట్టించుకోవడంలేదు. ఎక్కడైనా, ఎవరైనా అడిగినా ఇసుకను తవ్వుకుపోయేవాళ్లు పాత కాంట్రాక్టు ఏజెన్సీ పేరుతో ఉన్న ఓ పనికిరాని రశీదును చూపించేస్తారు. అది చెల్లుబాటు కాదని తెలిసినా… ఎవరూ ఆపరు! ఎందుకంటే… ఈ ఇసుక దోపిడీ ఎలా, ఎవరి ద్వారా జరుగుతోందో పైస్థాయి నుంచి కిందిస్థాయి దాకా మొత్తం అందరికీ తెలుసు!
సీఎం సొంత జిల్లాలో..
సీఎం సొంత జిల్లా కడపలో ఇసుక అక్రమ తవ్వకాలు మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతున్నాయి. వైసీపీ నేతలు అడ్డగోలుగా తవ్వేసి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. సొంత పార్టీ నేతలే ఇసుకాసురులపై తిరుగుబాటు ప్రకటించినా ముఖ్యనేత కుటుంబ సభ్యుల ఆశీస్సులు ఉండడంతో తవ్వకాలు ఆగడం లేదు. ముఖ్యమంత్రి జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఇలాకాలోని వీఎన్‌పల్లె మండలం సంగమేశ్వర ఆలయ సమీపంలో జోరుగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు.
ముఖ్యనేత బంధువులు రూ.కోట్లు గడిస్తున్నారు. ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని వీరపునాయునిపల్లె మండల సమావేశంలో సభ్యులంతా ఏకగ్రీవ తీర్మానం చేసినా పట్టించుకున్న వారు లేరు. వల్లూరు మండలంలోని పుష్పగిరి వద్ద ఇసుక తవ్వకాలను స్థానికులు అడ్డుకున్నారు. నేతలు వారిపైనే దాడిచేశారు. అన్నమయ్య జిల్లాలో పాపాఘ్ని నది సమీపంలో పట్టా భూముల్లో సైతం ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. టిప్లర్లతో రాత్రింబవళ్లు తరలిస్తున్నారు. ప్రశ్నిస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తారేమోనని భయంతో స్థానికులు మౌనంగా ఉంటున్నారు. బాహుదా, పింఛా, చెయ్యేరు, మాండవ్య నదులు.. స్థానికంగా ఉండే వాగులు, వంకలు, కుంటల్లో సైతం ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్నారు.
జోరుగా అక్రమ రవాణా జరుగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఇక బాపట్ల జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అఖండ గోదావరిలో అనధికారికంగా ఇసుక డ్రెడ్జింగ్ సాగుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలోని గోదావరి ర్యాంపులన్నీ ఒక కాంట్రాక్టర్‌కు సబ్ లీజుకు ఇచ్చినట్టు తెలిసింది. సదరు కాంట్రాక్టరు నెలకు సుమారు రూ.7 కోట్ల వరకూ ప్రభుత్వ పెద్దలకు చెల్లించి ఇష్టానుసారం ఇసుక తవ్వేస్తున్నాడు. గోదావరిలో నీరు ఉండటంతో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తీస్తున్నారు.
మహామాయ
మాయాజాలన్నింటిని తలదన్నే మహా మాయాజాలం ఇది. జేపీ వెంచర్స్, టర్న్‌కీ కాంట్రాక్టు మే 13నే ముగిసిపోయింది. ఇది తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఎవరికీ తెలియని నిప్పులాంటి నిజం బయటికొచ్చింది. జేపీ వెంచర్స్ జీఎస్టీ నంబర్ ఎప్పుడో సస్పెండైంది. అంటే ఆ సంస్థ ప్రభుత్వానికి పన్ను కట్టదు. ప్రభుత్వం కూడా వసూలు చేయదు. మరి ఇప్పుడు జరుగుతున్నదేమిటి? క్షేత్రస్థాయిలో వారి వే బిల్లులే కనిపిస్తున్నాయి. తమ పేరిట బిల్లు ఇస్తే తామే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని వాటికి తెలియని విషయం కాదు. తాము చేయని వ్యాపారానికి తమ పేరిట వే బిల్లులు ఇవ్వడం నేరం. ఈ విషయం తెలిసి కూడా జేపీ సంస్థ ఎందుకు స్పందించడం లేదు? పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? ఈ మౌనం వెనుక బలమైన శక్తులు ఉన్నట్లు తేలిపోతోంది?
జేపీ అసలు కట్టలేదు!
మధ్యప్రదేశ్‌కు చెందిన జేపీ వెంచర్స్ వివిధ రాషా్ట్రల్లో పలురకాల కాంట్రాక్టులు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలు చేపట్టకముందే, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాషా్ట్రల్లో 14 జీఎస్టీ నంబర్లు కలిగి ఉంది. మధ్యప్రదేశ్‌లో చెల్లింపులు ఒకలా, ఆంధ్రలో మరోలా చేసింది. 2022-23 సంవత్సరానికి జూన్, జూలై జీఎస్టీ బకాయిలను నవంబరులో చెల్లించింది. 2022 ఆగస్టు బకాయిలను ఈ ఏడాది జనవరి 5న, గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరు బకాయిలను ఈ ఏడాది మార్చి 13న చెల్లించింది.. గత ఏడాది నవంబరు. డిసెంబరు పన్నును ఈ ఏడాది జూన్ 22వ తేదీన చెల్లించింది.
ఈ చెల్లింపులను పరిశీలిస్తే రెండు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీలో ఇసుక వ్యాపారం జోరుగా చేస్తూ సకాలంలో జీఎస్టీ చెల్లించలేదు. ఒక నెల బకాయిని ఐదారు నెలల తర్వాత చెల్లించినట్లుగా స్పష్టమవుతోంది. చివరి 10 నెలల చెల్లింపులను పరిశీలన చేస్తే ఏనాడూ సకాలంలో చెల్లించనేలేదు. అయినా ఆ సంస్థపై ఎలాంటి చర్యలు లేవు. నోటీసులు లేవు. విచారణా లేదు. జేపీవెంచర్స్పైనే ఎందుకీ కరుణ చూపారు? సామాన్యులు, చిరు వ్యాపారులు ఇదే పనిచేస్తే వారి జీవితాలను రోడ్డుమీదకు లాగే ప్రభుత్వం జేపీ విషయంలో ఎందుకు మిన్నుకుండిపోయింది?
రెండో కీలకమైన అంశం…. కాంట్రాక్టు ముగిసిన తర్వాత అంటే, మే నెల తర్వాత గత ఏడాది బకాయిలతోపాటు, ఈ ఏడాదిలో మార్చి వరకు జీఎస్టీ చెల్లించింది. ఇదెలా సాధ్యం? ఇంతటి జాప్యంపై ఆ సంస్థపై ఇటు సర్కారు, అటు జీఎస్టీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ చెల్లింపులను పరిశీలిస్తే అసలు ఇసుక వ్యాపారం జేపీ వెంచర్స్, టర్న్‌కీ కంపెనీలే చేశాయా అన్న మౌలిక ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు కారణం పేరున్న ఏ కంపెనీ ప్రభుత్వానికి ఆలస్యంగా పన్నులు చెల్లించదు. జీఎస్టీలను పెండింగ్ పెట్టదు. దాని వల్ల కంపెనీల రేటింగ్ పడిపోతుంది. అదే జరిగితే మార్కెట్లో వాటి విలువ తగ్గిపోతోంది. కాబట్టి ఏ కంపెనీ తెలిసి తెలిసి ఆలస్యంగా చెల్లించవు.
ఇతర రాషా్ట్రల్లో సమయానుగుణంగా జీఎస్టీలు చెల్లించిన జేపీ వెంచర్స్ ఏపీలో మాత్రం అందకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. పోనీ ఇక్కడ ఇసుక వ్యాపారం ఏమైనా తక్కువగా జరిగిందా అంటే అదేం లేదు. రాష్ట్రంలో అన్నిటి కంటే ఒక్క ఇసుక వ్యాపారమే బాగా జరిగింది. కాబట్టి, జేపీ సంస్థ నిజంగా ఇసుక వ్యాపారమే చేసి ఉంటే పన్నుల చెల్లింపులో ఆలస్యం చేయదు. కానీ ఇక్కడ ఆలస్యమే జరిగింది. అది కూడా ఐదారె నెలల ఆలస్యంగా పన్నులు కట్టింది. ఈ నేపథ్యంలో అసలు ఈ సంస్థ వ్యాపారం చేసిందా? లేక ఆ సంస్థ పేరిట మరెవరైనా ఇసుక సామ్రాజ్యాన్ని నడిపారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.