రిపబ్లిక్ టీవీ చానల్ చీఫ్ కమ్ ప్రముఖ జర్నలిస్టు ఆర్నాబ్ గోస్వామి అరెస్టు ఉదంతం అంతకంతకూ ముదురుతోంది. ఆర్నాబ్ ను అరెస్టుపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. గతంలో మరెవరి అరెస్టులోనూ ఇంత ఎక్కువగా స్పందించింది లేదంటున్నారు. అంతేకాదు.. అర్నాబ్ ను అరెస్టు చేసిన నిమిషాల వ్యవధిలోనే.. కేంద్రమంత్రులు స్పందించటం.. మహారాష్ట్ర సర్కారు తీరును తప్పుపట్టటం తెలిసిందే.
ఈ వ్యవహారం బీజేపీ – శివసేన మధ్య వివాదం మరింత ముదురుతోంది. దీర్ఘ కాలంపాటు బీజేపీ – సేన మధ్య ఉన్న స్నేహం.. గత అసెంబ్లీ ఎన్నికల వేళలో ఇరువురి మధ్య పెరిగిన దూరం.. అంతకంతకూ పెరగటమే కానీ తగ్గని పరిస్థితి. ఇదిలా ఉంటే..ఆర్నాబ్ అరెస్టును బ్లాక్ డేగా అభివర్ణిస్తూ బీజేపీనేతలు మండిపడుతున్నారు.
వారి వ్యాఖ్యలపై తాజాగా శివసేన అధికారిక పత్రిక సామ్నా ఘాటుగా స్పందించింది. తన ఎడిటోరియల్ లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. అక్కడి ప్రభుత్వాలు వ్యవహరించిన తీరుకు సంబంధించిన పలు ఉదంతాల్ని ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆర్నాబ్ గో స్వామి అరెస్టును.. పత్రికా స్వేచ్ఛపై దాడి.. అత్యవసర పరిస్థితులు అంటూ కేంద్రమంత్రులు వ్యాఖ్యానించటాన్ని తప్పు పట్టింది.
వారు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు.. హత్యల మాటేమిటి? తమ మీద ఆరోపణలు చేస్తున్న వారే.. ప్రజాస్వామ్యంలో మొదటి స్తంభమైన శాసనసభను ధ్వంసం చేయటానికి ప్రయత్నిస్తున్నారన్నారు. మీడియా పై మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దాడి చేయటం లేదన్నారు.
గత ప్రభుత్వం ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యను కప్పి పెట్టిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు గుజరాత్ లో ఒక జర్నలిస్టు అరెస్టు అయ్యారని.. యూపీలో హత్యలకు గురవుతున్నారన్నారు. ఒక అమాయక వ్యక్తి తన పెద్ద వయస్కురాలైన తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య న్యాయం కోసం పోరాడుతోంది. వారికి సహకారం అందించాలని పేర్కొంది.
చట్టం ముందు ప్రధానితో సహా అందరూ సమానమేనని పేర్కొనటం చూస్తే.. ఆర్నాబ్ గోస్వామి అరెస్టుపై తమ స్టాండ్ క్లియర్ గా ఉందన్న విషయాన్ని తాజా ఎడిటోరియల్ లో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.