డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సాంకేతిక కారణాలతో ఆర్యన్ బెయిల్ పిటిషన్ ను మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించడంతో ఆర్యన్ దాదాపు నెల రోజుల పాటు జైల్లో ఉన్నాడు. చివరకు ఆర్యన్ ఖాన్ కు ఊరటనిస్తూ…బాంబే హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఇక, ఈ కేసు దర్యాప్తు అధికారి , ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై కూడా సంచలన ఆరోపణలు రావడం కలకలం రేపింది.
ఆర్యన్ వ్యవహారంలో వాంఖడే తరపున ఒక వ్యక్తి రూ.25 కోట్లు డబ్బు డిమాండ్ చేసినట్లు సంచలన ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఇక, వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేయడం షాకింగ్ గా మారింది. బాలీవుడ్ సెలబ్రిటీల ఫోన్లను సమీర్ వాంఖడే ట్యాప్ చేసి, భారీ మొత్తంలో డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ మాలిక్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. నకిలీ సర్టిఫికేట్లతో వాంరడూ ఉద్యోగం సంపాదించాడని ఆరోపించారు. దీంతో, మాలిక్ ఆరోపణలపై ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్ జైన్ దర్యాప్తునకు ఆదేశించారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసులో వాంఖడేకు షాక్ తగిలింది. ఈ కేసు నుంచి వాంఖడేను తప్పిస్తూ ఎన్సీబీ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. వాంఖడే స్థానంలో విచారణాధికారిగా సంజయ్ సింగ్‌ను నియమించారు. వాంఖడేను ఢిల్లీలో ఎన్సీబీ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఇకపై ఆర్యన్‌ఖాన్ కేసు సహా మొత్తం ఆరు డ్రగ్ కేసులను సంజయ్ సింగ్ నేతృత్వంలో ఎన్సీబీ సెంట్రల్ యూనిట్ దర్యాప్తు చేయనుంది. అయితే, ప్రస్తుతం వాంఖడేపై దర్యాప్తు కొనసాగుతుండగానే ఆయన్ని తప్పించడం చర్చనీయాంశమైంది.