తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న పర భాషా కథానాియికల్లో సమంత ఒకరు. అసలామెను తమిళ అమ్మాయి అనే కోణంలోనే చూడరు మనవాళ్లు. ఆమె సినిమాల్లో స్టార్ స్టేటస్ సంపాదించింది.. ఎక్కువ చిత్రాల్లో నటించింది.. తన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది కూడా టాలీవుడ్లోనే. నటిగానే కాక వ్యక్తిగతంగానూ సమంత తెలుగు వాళ్ల మనసు దోచింది. అందుకే ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాలను కూడా మన జనాలు క్లోజ్‌గా ఫాలో అవుతుంటారు.
ఆమె నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నపుడు ముచ్చటపడ్డారు. వాళ్లిద్దరూ విడిపోతున్నపుడు ఆవేదన చెందారు. ఆపై సామ్ అనారోగ్యం పాలైనపుడు చాలామంది తల్లడిల్లిపోయారు. కొన్ని నెలల పాటు చికిత్స తీసుకుని తిరిగి సినిమాల్లో కూడా నటించింది సామ్. కానీ ఆమె పూర్తి ఆరోగ్యవంతురాలు మాత్రం కాలేదు. అందుకే మళ్లీ బ్రేక్ తీసుకుని మరో దశ చికిత్సకు సిద్ధమైంది. పూర్తి స్థాయిలో కోలుకోవాలని చూస్తోంది. కాగా ఈసారి విదేశాల్లో చికిత్స తీసుకోనుండటంతో చాలా ఖర్చు కాబోతోందని.. ఆమెకు ఒక హీరో ఏకంగా రూ.25 కోట్ల సాయం అందజేశాడని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.
దీని గురించి సమంత ఇన్‌స్టాలో స్పందించింది. 25 కోట్లనేది చాలా పెద్ద మొత్తమని.. తన చికిత్సకు అందులో చాలా తక్కువ శాతమే ఖర్చవుతుందని ఆమె వ్యంగ్యంగా స్పందించింది. అయినా తనకు పారితోషకం రూపంలో ఎవ్వరూ రాళ్లు ఇవ్వలేదని.. తన చికిత్సకు ఖర్చు పెట్టుకోగల స్థోమత తనకు ఉందని సమంత వ్యాఖ్యానించింది. మయోసైటిస్ గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించి.. దాని బాధితుల్లో స్థైర్యం నింపాల్సిన అవసరం గురించి కూడా సమంత మాట్లాడింది.