సౌత్ ఇండియాలోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా సమంత రూత్ ప్రభు గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సమంత…ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది. అరుదైన మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సమంత….కాస్త కోలుకున్న తర్వాత శాకుంతలం, సిటాడెల్ వంటి ప్రాజెక్టులతో బిజీ అయింది. సమంత మయాసైటిస్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదన్న సంగతి తెలిసిందే.
దీంతో సమంత వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి చికిత్స కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మయాసైటిస్ వ్యాధి లక్షణాలలో ముఖ్యమైన కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు సమంత హైపర్ బారిక్ అనే ఆక్సిజన్ థెరపీ చేస్తోంది. కండరాల నొప్పుల వల్ల శరీరం అంతా ఇన్ ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్లు కావడానికి అవకాశం ఉంది. వాటిని తగ్గించేందుకు ఈ హైపర్ బారిక్ ఉపయోగపడుతుంది. ఈ థెరపీ ద్వారా దెబ్బతిన్న కణాలు
తిరిగి కోలుకొని నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
నిర్ణీత ఒత్తిడితో కూడిన స్వచ్ఛమైన ఆక్సిజన్ ను తీసుకోవడమే హైపర్ బారిక్ థెరపీ. సాధారణ వాయుపీడనంతో మనం తీసుకునే ఆక్సిజన్ తో పోలిస్తే ఈ ఆక్సిజన్ థెరపీ ద్వారా ఎక్కువ ఆక్సిజన్ ఊపిరితిత్తులకు అందుతుంది. ఇలా అదనంగా అందిన ఆక్సిజన్….బ్యాక్టీరియాతో పోరాడడంలో సహాయపడుతుంది. శరీరంలో స్టెమ్ సెల్స్ విడుదలయ్యేందుకు ఈ హైపర్ బారిక్ థెరపీ ఉపయోగపడుతుందని తెలుస్తోంది. కాగా, శాకుంతలం నిరాశపరచడంతో…తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ సిటాడెల్ పైనే సమంత ఆశలు పెట్టుకుంది.