టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఒకరైన సమంత–నాగచైతన్యల విడాకుల విషయంపై కొద్ది నెలల క్రితం తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. వారిద్దరూ అధికారికంగా విడాకుల గురించి ప్రకటించకముందే రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేశాయి. ఇక, వారిద్దరూ విడిపోయిన తర్వాత కూడా ఫలానా కారణంతోనే విడిపోయారంటూ సోషల్ మీడియాలో అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేశారు.
ఇక,తనపై దుష్ప్రచారం చేసిన మూడు యూట్యూబ్ చానెళ్లపై సామ్ కోర్టుకు వెళ్లింది కూడా. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి తన విడాకుల విషయంపై సమంత స్పందించింది. విడాకుల సమయంలో అభిమానులంతా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, దానిని తాను అర్థం చేసుకోగలనని అన్నారు. అయితే, ట్రోలింగ్ లా కాకుండా మరోలా అభిప్రాయాలు చెబితే బాగుండేదని చెప్పింది సామ్. అభిమానులతో అన్ని విషయాలు పంచుకుంటానని, అది తన జీవితంలోకి వారిని ఆహ్వానించడమే అవుతుందని చెప్పింది.
అయితే, అభిమానులు ఆశించినట్టుగా తన నిర్ణయాలు, వ్యాఖ్యలు ఉండకపోవచ్చని, నా నిర్ణయాలను అభిమానులంతా అంగీకరించాలని తాను ఆశించడం లేదని వెల్లడించింది.‘‘నాకేవో అఫైర్లున్నాయని.. పిల్లలు వద్దన్నానని.. అబార్షన్లయ్యాయని.. అవకాశవాదినని.. ఇలా వారు చేసిన ఎన్నో కామెంట్లు తనను బాధించాయని చెప్పింది. విడాకులు అనేదే బాధాకరమైన వ్యవహారమని, ఆ గాయాన్ని ఒంటరిగా నయం చేసుకుందామనుకునే సమయంలో ఈ ట్రోలింగ్ వల్ల ఆ గాయం పెరిగిందని చెప్పుకొచ్చింది. గత ఏడాది వేసుకున్న ప్రణాళికలు, కలలు పటాపంచలయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే, రాబోయే ఏడాదిపై ఏ అంచనాలు పెట్టుకోవడం లేదని తెలిపింది.