సోషల్ మీడియాలో సెలబ్రెటీల అకౌంట్లను చాలా వరకు పీఆర్ టీంలే మేనేజ్ చేస్తుంటాయన్నది రహస్యమేమీ కాదు. సెలబ్రెటీలు అదే పనిగా ట్విట్టర్లో, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో కూర్చుని పోస్టులు పెట్టడం అంటే కుదరని పని. వారిని సంప్రదించి, అభిప్రాయాలు తెలుసుకుని అందుకు అనుగుణంగా పీఆర్ టీంలు పోస్టులు పెడుతుంటాయి.
కొన్ని సందర్భాల్లో ఆ సెలబ్రెటీలే కొన్ని పోస్టులు పెడితే పెట్టొచ్చు. పూర్తిగా సెలబ్రెటీలే అకౌంట్లను మెయింటైన్ చేస్తూ పోస్టులు పెట్టడం చాలా కొద్ది మంది విషయంలోనే జరుగుతుంటుంది. పీఆర్ టీంలు మెయింటైన్ చేసే హ్యాండిల్స్‌లో కొన్నిసార్లు పొరబాట్లు కూడా జరగొచ్చు.
అలాంటి తప్పిదమే ఇప్పుడు సోషల్ మీడియాను హీటెక్కించేసింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సంబంధించిన పోస్ట్ కనిపించడం సంచలనం రేపింది.
నా ప్రజలే నా బలం నా ధైర్యం నా నమ్మకం అన్న వ్యాఖ్యతో దండం పెడుతున్న కేటీఆర్ ఫొటో ఒకటి సమంత ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ అయింది. సమంత పేజీలో ఇలాంటి పోస్టేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. ఐతే అది బహుశా కేటీఆర్ అకౌంట్ నుంచి పడాల్సిన పోస్టు అయి ఉండొచ్చు. లేదా ఇంకెవరి అకౌంట్‌కు సంబంధించినదైనా అయ్యుండొచ్చు. ఐతే ఈ లోపు ఈ పోస్ట్ వైరల్ అయిపోయింది.
దీని గురించి రకరకాల కామెంట్లు చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. దీంతో ఈ పోస్ట్ డెలీట్ అయిపోయింది. దీనిపై సమంత పీఆర్ టీం వివరణ కూడా ఇచ్చింది. సాంకేతిక సమస్య వల్ల ఈ పోస్ట్ సమంత అకౌంట్లో వచ్చిందని.. ఇలా ఎందుకు జరిగిందో పరిశీలిస్తున్నామని.. దీని వల్ల తలెత్తిన గందరగోళానికి చింతిస్తున్నామని సామ్ పీఆర్ టీం పేర్కొంది.
మామూలు జనాలు దీనికి పెడార్థాలు తీసినప్పటికీ.. సెలబ్రెటీల అకౌంట్లను పీఆర్ టీంలు మెయింటైన్ చేస్తుంటాయని తెలిసిన వాళ్లు ఈ క్రాస్ పోస్ట్ గురించి బాగానే అర్థం చేసుకున్నారు.
Keep that smile on beautiful @Samanthaprabhu2 ❤️#SamanthaRuthPrabhu #Samantha pic.twitter.com/PGHca1VyLz
— ANil ANiee (@Anil_Sammu) July 2, 2022