సౌత్ ఇండియాలోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా సమంత రూత్ ప్రభు గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సమంత…ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమైంది. అరుదైన మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సమంత….కాస్త కోలుకుంది. దీంతో, జిమ్ లో కఠినమైన వర్కవుట్స్ చేస్తూ తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం కసరత్తులు చేస్తోంది.
ఇలా, సినీ ఇండస్ట్రీలో తన 13 ఏళ్ల జర్నీని ఇటీవలే పూర్తి చేసుకున్న సమంత తాజాగా వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ‘సిటాడెల్’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సమయంలో సమంత గాయపడింది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా సామ్ కు దెబ్బలు తగిలాయి. రెండు చేతులకు గాయాలైన విషయాన్ని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రెండు చేతుల ఫొటో పెట్టి.. ‘యాక్షన్ ఫలితం’ అంటూ క్యాప్షన్ పెట్టింది.
యాక్షన్ సన్నివేశాల్లో నటించేందుకు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ దగ్గర ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నా.. గాయాలు మాత్రం తప్పలేదంటూ సామ్ కామెంట్ చేసింది. ‘సిటాడెల్’లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సామ్ నటిస్తోంది. ‘ ది ఫ్యామిలీ మ్యాన్’ తెరకెక్కించిన దర్శక ద్వయం రాజ్ – డికే ఈ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ తీస్తున్న ‘సిటాడెల్’ అనే వెబ్‌సిరీస్‌కి ఇది ఇండియన్ వర్షన్. హాలీవుడ్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మడ్డెన్, స్టాన్లీ టుస్సీ నటిస్తున్నారు.