అనుకున్నదే నిజమైంది. నిప్పు లేకుండా పొగ రాదంటారు. సెలబ్రిటీలు కావొచ్చు.. ప్రముఖులు కావొచ్చు.. వారి వ్యక్తిగత విషయాల గురించి మీడియాలో ఏదైనా వస్తే.. దాని మీద విరుచుకుపడటం.. ఆ తర్వాత కొంతకాలానికి అదే నిజం కావటం ఇప్పుడేం కొత్త కాదు. మొదట్నించి ఇది ఉన్నదే. మరోసారి ఇది నిజమైంది. సామ్ చైతూ జోడి మధ్య బ్రేకప్ అయ్యిందని.. వారిద్దరూ విడిపోతున్నట్లుగా పెద్ద ఎత్తున చర్చ జరగటం.. ఇదే విషయం మీద తిరుపతిలో ఒక రిపోర్టర్ అడిగితే.. గుడి దగ్గర ఏమిటి? బుద్ది ఉందా? అంటూ సమంత ఫైర్ కావటం తెలిసిందే.
మరి.. ఆ రోజున గుడి దగ్గర ఇదేంటన్న సమంత.. రెండు వారాలు గడిచేసరికి.. గాంధీ జయంతి లాంటి విశిష్టమైన రోజున ఇలాంటి ప్రకటన చేయటం ఏమిటి? ఏమైనా బుద్ధి ఉందా? అని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? అందుకే అంటారు.. తమకు సంబంధించిన విషయాల గురించి ఏదైనా అడిగితే.. ఇట్టే పొడుచుకు వచ్చే సెలబ్రిటీలు.. చివరకు మీడియా చెప్పింది నిజమని ప్రకటించే వేళలో మాత్రం వినయంగా.. విధేయతతో.. తమను అభిమానించే అభిమానులకు తెలియజేయటంలో అర్థమంటూ ఉందా? అన్నది ప్రశ్న.
కష్టకాలంలో అభిమానుల మద్దతు కావాలని కోరిన వారు.. ఎప్పుడో జరిగిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు? అన్నట్లు.. విడిపోయి దాదాపు నెలల అయ్యాక.. తమకు నచ్చిన వేళలో విషయాన్ని చెప్పి ఫ్యాన్స్ మద్దతు అడగటంలో అర్థమేముంది? ఎప్పుడైతే సోషల్ మీడియాలో తన అత్తింటి వారి ఇంటి పేరును సమంత తీసేసిందో.. అప్పటికే విడిపోయారని చెబుతున్నారు. అలాంటప్పుడు కష్టకాలం ఇవాళే కాదు.. ఎప్పుడో వచ్చిందన్నది మర్చిపోకూడదు. మొన్నటికి మొన్న నాగార్జునను.. ఉత్త నాగార్జునగానే ప్రస్తావించిన సమంత.. తర్వాత పలువురు విమర్శల మెట్టికాయలు వేసిన తర్వాత ట్వీట్ తొలగించిన నేపథ్యంలో.. ఆమె కష్టకాలంలో ఉందని అనుకోవాలా?
విడాకుల విషయం మీద ఇప్పటికే చాలా చర్చ జరిగి.. అందరికి తెలిసిందే అయినప్పుడు.. ఇప్పుడు కొత్తగా తెలిసిందంటూ ఏమీ లేదు. కాకుంటే.. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లుగా వేర్వేరు ప్రకటనలతో చెప్పిన సామ్.. చైతులకు సంబంధించిన తేలాల్సిన విషయం ఒక్కటేనని చెబుతున్నారు. ఇప్పటికే సమంతకు భరణం కింద రూ.100కోట్లకు ఒప్పందం కుదిరిందని కొందరు.. కాదు రూ.300 కోట్లకు లెక్క సెటిల్ అయ్యిందని మరికొందరు అంటున్న వేళ.. దానికి సంబంధించిన క్లారిటీ మాత్రమే రావాల్సి ఉంది.
భరణం లెక్క మీకెందుకు? మీరు అభిమానులు.. మమ్మల్ని అభిమానించే బానిసలు. మీకు అలాంటి వ్యక్తిగత విషయాలు ఎందుకు చెప్పాలని సామ్ ఆగ్రహంతో ప్రశ్నించొచ్చు. విడిపోవటం కూడా వ్యక్తిగత విషయమే కదా? అదే చెప్పినప్పుడు.. భరణం లెక్క కూడా చెప్పేస్తే కొంపలైతే మునగవన్నది నిజం. మరి.. ఈ విషయం మీద రాబోయే రోజుల్లో భారీ చర్చ జరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.