కమర్షియల్ హీరోయిన్గా టాప్ పొజిషన్లో ఉండాలనే ప్రయత్నాన్ని ఎప్పుడో విరమించుకుంది సమంత. మొదట్లో బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సరసన కనిపించిన ఆమె.. ఆ తర్వాత హీరో ముఖ్యం కాదు, కాన్సెప్ట్ ముఖ్యం అనుకోవడం మొదలుపెట్టింది.
యు టర్న్, ఓ బేబీ లాంటి సినిమాలతో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలను భుజాలపై మోయగలదనే నమ్మకాన్ని ఫిల్మ్ మేకర్స్‌కి ఇచ్చింది. ఇప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు సైతం ఆమెను వెతుక్కుంటూ రావడానికి కారణం అదే.
ఫ్యామిలీమేన్ 2 వెబ్ సిరీస్‌లో సమంతను చూస్తే నటనను ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. మేకప్ ఉండదు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ ఆ పాత్ర చుట్టూ కనిపించవు. కాన్సెప్ట్ బేస్డ్ క్యారెక్టర్ అది. ఎమోషన్స్‌ని ఫుల్‌గా లోడ్ చేసిన రోల్. దానికి నూరు శాతం న్యాయం చేయడంతో సమంతకి బాలీవుడ్ ఎంట్రీ ఈజీ అయిపోయింది.
త్వరలో ఓ ప్రెస్టీజియస్ హిందీ ఫిల్మ్‌లో నటించబోతోంది. రాజ్, డీకేలు తీయబోయే మరో వెబ్ సిరీస్‌లో కూడా లీడ్ రోల్ చేయబోతోంది.
ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యే ప్లాన్స్‌లో కూడా ఉంది. సునీత తాటి నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్టు సామ్ అనౌన్స్ చేసింది. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే పుస్తకం ఆధారంగా అదే పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి ఫిలిప్ జాన్ దర్శకుడు.
ఇందులో సామ్ బై సెక్సువల్‌గా కనిపించబోతోంది. ఇలాంటి పాత్ర చేయడమే కాదు, యాక్సెప్ట్ చేయడం కూడా సాహసమే. అయినా కూడా సమంత చేయాలని డిసైడయ్యింది.
ఇక తమిళంలో నటిస్తున్న ‘కాత్తువాక్కుల రెండు కాదల్’లో సమంత విలన్‌గా యాక్ట్ చేస్తోందనే టాక్ ఉంది. ‘శాకుంతలమ్’లో శకుంతలగా పౌరాణిక పాత్రలో మెప్పించబోతోంది. మరోవైపు ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ చేయడానికీ రెడీ అయ్యింది.
ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఎంచుకుంటున్న ప్రాజెక్ట్స్ చూస్తుంటే సమంత చూపు ప్రయోగాల వైపే ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. మరి ముందు ముందు ఇంకెన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తుందో చూడాలి.