చాలామంది వంటింట్లో ఉల్లిపాయ ఒక నిత్యావసర వస్తువు. వెజ్, నాన్ వెజ్ కేటగిరీలోని ఎన్నో వంటకాల్లో ఉల్లిపాయదే ముఖ్య భూమిక. కొన్ని కూరల్లో ఉల్లిపాయ పడనిదే ముద్ద దిగని వారు చాలామంది ఉన్నారు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అన్న నానుడికి తగ్గట్లుగానే ఉల్లిపాయని ఏదో ఒక రూపంలో తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే, తాజాగా అమెరికా, కెనడాలో మాత్రం ఉల్లి మేలుకు బదులు హాని చేస్తుండడం కలవరపెడుతోంది.
కూరల్లో, వంటకాల్లో ఉల్లిపాయ తిన్న అమెరికా, కెనడా పౌరులకు ‘సల్మోనేల్లా’ అనే వింత వ్యాధి సోకుతుండడం అగ్రరాజ్యాన్ని కలవరపెడుతోంది. అమెరికాలోని పలు రాష్ట్రాలలో ఈ వింత వ్యాధి కేసులు భారీగా నమోదవుతున్నాయట. అమెరికాలోని 37 రాష్ట్రాలలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని, 700మందికిపైగా ప్రజలు ఈ వింత వ్యాధి బారిన పడ్డారని, వారిలో 150 మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. డయేరియా, జ్వరం, కడుపు నొప్పి వంటివి ఈ వ్యాధి సోకిన వారిలో ప్రాథమిక లక్షణాలని తెలిపింది.
ఈ వ్యాధి తీవ్రత ముదిరితే పరిస్థితులు చేయిదాటొచ్చని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో, అమెరికావ్యాప్తంగా ఇటీవల సరఫరా అయిన ఉల్లిపాయలను తగులబెట్టేయాలని అధికారులు నిర్ణయించారు. ఎరుపు, తెలుపు రంగులో ఉన్న ఉల్లిపాయల వల్ల ‘సల్మోనేల్లోసిస్’ వ్యాధి విజృంభించిందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకినవారు వెంటనే నీటిని తాగాలని, వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.