ఇటీవల `రాధేశ్యామ్`తో ప్రేక్షకులను పలకరించి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం `సలార్` అనే మూవీ చేస్తున్నాడు.
`కేజీఎఫ్`తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరాగందుర్ హై బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
గత ఏడాదే సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ ముప్పై శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. మిగిలిన భాగాన్ని కూడా త్వరత్వరగా పూర్తి చేసేందుకు షూటింగ్ ను రీ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం శంషాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ప్రభాస్ పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సలార్ టీజర్ ను ఈ నెలాఖరులో విడుదల చేయనున్నామని మేకర్స్ ఇటీవల అధికారికంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచీ డార్లింగ్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ మొదలైంది. ఎప్పుడెప్పుడు టీజర్ బయటకు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇలాంటి తరుణంలో నిర్మాత విజయ్ కిరాగందుర్ ఊహించని షాక్ ఇచ్చారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ కిరాగందుర్ కు సలార్ టీజర్ పై ప్రశ్న ఎదురైంది.
దానికి ఆయన మే నెలలో సలార్ టీజర్ ని రిలీజ్ చేయడం లేదని, ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని పేర్కొన్నారు.
టీజర్ విడుదలకు ప్రత్యేక తేదీని ఇంకా లాక్ చేయలేదని, దానిపై మరి కొద్ది రోజుల్లో స్పష్టత రానుందని ఆయన వెల్లడించారు.
ఇక టీజర్ వాయిదా పడిందని తెలియడంతో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు.
ఈ క్రమంలోనే ఊరించి ఉసూరుమనిపించారు.. ఇది న్యాయమా అంటూ సలార్ టీమ్ పై అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి వీరి ఆగ్రహాన్ని మేకర్స్ ఎంత త్వరగా చల్లారుస్తారో చూడాలి. కాగా, భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ 2023 సమ్మర్ కానుకగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇందులో ప్రభాస్ మున్నెప్పుడూ చూడని మాస్ లుక్ లో అలరించబోతున్నారు.