బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్లో అత్యధిక అంచనాలతో రాబోతున్న సినిమా సలార్ . సరైన ప్రమోషనల్ కంటెంట్ ఏదీ రిలీజ్ చేయకపోయినా సరే.. సాహోను మించి హైప్ తెచ్చుకుందీ చిత్రం. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు 28కే అనుకున్న ఈ చిత్రాన్ని అప్పటికి రెడీ చేయలేక మూడు నెలలు వాయిదా వేయడం తెలిసిన సంగతే. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 22న ఈ చిత్రం రిలీజవుతుందని నెల కిందటే ప్రకటించారు.
షారుఖ్ ఖాన్ సినిమా ‘డంకీ’ క్రిస్మస్కే షెడ్యూల్ అయిందని తెలిసే ఈ డేట్ ప్రకటించారు. ‘డంకీ’తో పోలిస్తే ‘సలార్’కే హైప్ ఎక్కువ అనే విషయంలో సందేహాలే అక్కర్లేదు. పైగా ఇది పక్కా మాస్, యాక్షన్ మూవీ కావడం అడ్వాంటేజ్. ఇటీవలే ‘డంకీ’ మినీ ట్రైలర్ వదలగా.. అది ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ ‘సలార్’ టీం కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది.
‘సలార్’తో పోటీకి భయపడితే ‘డంకీ’ టీం భయపడాలి కానీ.. ‘డంకీ’ని చూసి ‘సలార్’ భయపడే పరిస్థితి ఎంతమాత్రం లేదు. ఈ రెండు చిత్రాలూ ఒకేసారి రిలీజైతే ‘సలార్’కు వచ్చే ఓపెనింగ్స్‌లో ‘డంకీ’కి సగం కూడా రావనే విషయంలో అనుమానమే లేదు. అలాంటిది ‘డంకీ’ని చూసి ‘సలార్’ టీం భయపడి తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ఓ ప్రచారం నడుస్తోంది. మామూలుగా ‘సలార్’ మరోసారి వాయిదా అంటే అభిమానులు కంగారు పడిపోవాలి. కానీ ఈ వార్తలను వాళ్లు లైట్ తీసుకుంటున్నారు.
అందుక్కారణం.. ‘డంకీ’కి భయపడి ‘సలార్’ను వాయిదా వేస్తున్నారని ప్రచారం చేయడమే. ఒకవేళ నిజంగా ‘సలార్’ వాయిదా పడితే.. అది పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాక, డెడ్‌లైన్‌ను అందుకోలేక వాయిదా పడాలి. అంతే కానీ ‘డంకీ’కి భయపడే పరిస్థితి ఎంతమాత్రం లేదు. అందుకే ఫ్యాన్స్ వాయిదా వార్తలను లైట్ తీసుకుంటున్నారు. ‘సలార్’ టీం వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ చిత్రం పక్కాగా డిసెంబరు 22నే రాబోతోందట. ఇంకోసారి వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారం ఉత్తుత్తిదే అని అంటున్నారు.