నమ్ముకున్నోళ్లు చేసే నష్టం అంతా ఇంతా అన్నట్లు ఉండదు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా? తన సొంత సంస్థ చేసిన పని ఇప్పుడాయన్ను ఇబ్బందిలో పడేలా చేసిందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.
మీడియాకు సంబంధించి సాధారణ ప్రజలకు ఒక అపోహ ఉంటుంది. అదేమంటే.. ఈనాడులో వచ్చే హెడ్డింగ్ మొదలు వార్తల వరకు అన్ని ఆ పత్రిక యజమాని రామోజీరావుకు తెలిసే ఉంటుందని. ఆయనే ప్రాధాన్యతల్ని డిసైడ్ చేస్తాడని. కానీ.. వాస్తవంగా అలా జరగదన్న విషయం మీడియాలో పని చేసే వారికి తెలుసు. చాలా కీలకమైన సందర్భాల్లో తప్పించి పత్రికా సంస్థల యజమానులు దాదాపుగా తలదూర్చరు.
రోజువారీగా జరిగే పనిలో తలదూర్చటం వారికున్న పనుల ఒత్తిడిలో సాధ్యం కాదు. చాలా అరుదైన సందర్భాల్లో సైతం ఇలా చేస్తే బాగుంటుందన్న మాటనే తప్పించి.. ఇలానే చేయాలన్న మాట దాదాపుగా ఉండదు. ఈ విషయం పత్రికల్లో పని చేసే వారిలో కూడా చాలామందికి తెలీదు. అన్నింటికి మించిన పెద్దపత్రికలు.. ప్రధాన పత్రికల్లో తీసుకునే విధానపరమైన నిర్ణయాలు.. వాటిని కిందిస్థాయికి చేర్చే వైఖరి ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది.
ఈనాడు విషయాన్నే తీసుకుంటే.. చాలా చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే రామోజీరావు వార్తల ప్రాధాన్యత గురించి జోక్యం చేసుకుంటారని చెప్పాలి. దివంగత మహానేత వైఎస్ అనూహ్య మరణం వేళ.. ఆయన మరణ వార్తను ఎలా ప్రజెంట్ చేయాలన్న సందేహం నాడు ఈనాడులో పని చేసిన రిపోర్టర్లకు.. బ్యూరో చీఫ్ లకు మాత్రమే కాదు.. డెస్కు ఇన్ ఛార్జిలకు కూడా ఎదురైంది.
ఆ రోజున రామోజీరావు ఫిలింసిటీ నుంచి సిటీకి రావటం.. ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెబుతారు. వైఎస్ భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం.. పత్రికకు సంబంధించిన అతి ముఖ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి దాన్ని అధికారిక సమావేశం అనే కన్నా కూడా ఇన్ ఫార్మల్ మీటింగ్ గా చెప్పొచ్చు.
ఆ సందర్భంగా వైఎస్ మరణవార్తకు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వాలన్న విషయాన్ని ఎలా ప్రస్తావించాలో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వేళ.. అక్కడ ఉన్న ఒక ముఖ్యుడు ఒకరు.. ప్రయారిటీ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించటం.. అందుకు స్పందించిన రామోజీరావు.. ‘ఆయనకు నాకు వ్యక్తిగతంగా చాలా ఉండొచ్చు. ఎవరూ పూడ్చలేని విషాదం. ఆయనకు సంబంధించి ఏమని ప్రజలు అనుకుంటారో.. దాన్నే రాయండి. ఎలాంటి పరిమితులు.. పరిధులు మనసులో పెట్టుకోకండి. జనాల మనసుల్ని గెలుచుకున్న ఆయనకు ఎలాంటి వార్తలు ఇవ్వాలో మీరే డిసైడ్ చేసుకోండి’ అని వ్యాఖ్యానించినట్లు చెబుతారు.
అప్పటివరకు మనసులో కోటి సందేహాలతో ఉన్న పత్రికా ముఖ్యులు.. ఆ సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే ఏమేం చేయాలో చెప్పటం.. దానికి అనుగుణంగా తీర్చిదిద్దిన పత్రిక పక్కరోజు ఉదయానికి పాఠకుల చేతుల్లో ఉండటమే కాదు.. ఆ రోజు పత్రిక మొదటి పేజీలో ప్రచురించిన నిలువెత్తు వైఎస్ ఫోటోను చూసి.. సాక్షి పత్రికకు చెందిన ప్రముఖులు సైతం.. తాము అలాంటి ఫోటోను వేయలేకపోయినందుకు చింతించినట్లుగా చెబుతారు.
జర్నలిజంలో సాక్షికి ఇతర పత్రికలకు ఉన్న తేడా ఇదే. ఇదంతా ఇపుడు ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే… సీబీఐ అధికారికంగా కోర్టు ద్వారా విడుదల చేసిన విషయాన్ని కూడా సాక్షి పత్రిక దాచిపెట్టే ప్రయత్నం చేసింది. కోర్టు వార్తను కూడా ట్విస్ట్ చేసే ప్రయత్నం చేసింది.
జగన్ బాబాయ్ దారుణ హత్యకు సంబంధించిన కీలక విషయం ఒకటి బయటకు రావటం.. దాన్ని మిగిలిన పత్రికలు ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురిస్తే.. సాక్షి అందుకు భిన్నంగా చాలా చిన్నగా లోపల పేజీల్లో.. ప్రచురించిన వైనం కొత్త సందేహాలతో పాటు.. అనవసరమైన చర్చకు తావిచ్చినట్లుగా చెప్పాలి. పైగా వార్తను ట్విస్ట్ చేస్తూ కోర్టులు, సీబీఐపై అనుమానం వ్యక్తంచేశారు.
హత్యకు కారణమైన నిందితుల్లో ఒకరైన వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలాన్ని ప్రజెంట్ చేసిన తీరు వేలెత్తి చూపేలా ఉంటమే కాదు.. సొంత కుటుంబ సభ్యుడి హత్యకు సంబంధించిన కీలకమైన అంశాల్ని ప్రజెంట్ చేయటం ఇలానా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఒకప్పుడు చంద్రబాబే వివేకాను హత్య చేయించాడు అన్న ఆరోపణ నిరాధారంగా చేసిన సాక్షి పత్రిక ఇపుడు నిజాలు బయటకు రావడంతో ఆ వార్తను దాచే ప్రయత్నం చేసింది.
లోపల పేజీల్లో వేసిన వార్త కూడా…. హత్యకు ప్లాన్ చేసిన వారి విషయం కంటే కూడా.. ల్యాండ్ సెటిల్ మెంటే కారణమంటూ పెట్టిన హెడ్డింగ్ మరింత దారుణం.
వివేకా హత్యను చెప్పాల్సిన టోన్ లో చెప్పకుండా.. మరోలా చెప్పటం ఏమిటన్నది మరో ప్రశ్న. సాక్షి వార్తను దాచిపెట్టడం, గతంలో ఈ కేసును సీబీఐకి ఇవ్వద్దు అని జగన్ హైకోర్టులో కేసును ఉపసంహరించుకోవడం, తాజాగా ఆధారాలు బయటపడినా ఆ వార్త దాచడం వంటివి చూస్తే అసలు నిందితులు ఎవరో సీబీఐ తేల్చక ముందే ప్రపంచానికి తెలుగుజనానికి స్పష్టంగా అర్థమైందనుకోవాలి.