జగన్ సీఎం అయిన తర్వాత ఆయన సతీమణి ఆధ్వర్యంలో నడుస్తున్న ‘సాక్షి’మీడియాకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్న విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మార్కెట్లో సాక్షికి పోటీగా, సాక్షి కంటే అధిక సర్క్యులేషన్ ఉన్న ప్రధాన పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలను తోసిరాజని సాక్షి పత్రికకు అప్పణంగా అడ్వర్టయిజ్ మెంట్లు కట్టబెడుతున్నారని టాక్ ఉంది.
ఉదాహరణకు ప్రధాన పత్రిక‘ఆంధ్రజ్యోతి’కి రూ.25 లక్షల విలువైన ప్రకటనలు ఇస్తే…ప్రజాశక్తి రూ.2.98కోట్లు, విశాలాంధ్ర రూ.1.87 కోట్లు, ఆంధ్రప్రభ రూ.2.15 కోట్లు, ఆంధ్రభూమి రూ.50 లక్షలు, వార్త రూ.1.35 కోట్లు విలువైన ప్రకటనలు దక్కించుకోవడం జగన్ పక్షపాత ధోరణికి నిదర్శనం. సరే ఇంతా చేసినా..సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెరగలేదని, అందుకే పత్రిక సర్క్యులేషన్ ను పెంచేందుకు యాజమాన్యం నష్టాలను భరించి మరీ బంపర్ ఆఫర్ లు ప్రకటిస్తోందని టాక్ వస్తోంది.
కాపీల సంఖ్య పెరిగితే చాలు అన్న రీతిలో వినూత్న స్కీమ్‌లకు తెర తీస్తోందని, రూ. 1000 చందా కడితే ఏడాది పాటు సాక్షి పత్రిక వేస్తామంటూ స్కీమ్ లతో ముందుకు వెళుతోందని విమర్శలు వస్తున్నాయి. మామూలుగా సాక్షి పత్రిక రేట్ల ప్రకారం సంవత్సర చందా కట్టినా…సుమారు 1500-2000 మధ్యలో ఉంటుంది. మరీ 1000 రూపాయలకే సంవత్సర చందా అంటే అస్సలు బాగోదు కాబట్టి అనధికారికంగా ప్రభుత్వ అనుబంధ సంస్థలు, కార్పొరేషన్లు, ముఖ్యమైన సంస్థల్లో పని చేసే వారు, చదువుకునే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ ఆఫర్ అంటూ వారిపై రుద్దుతున్నారట.
ఈ క్రమంలోనే తాజాగా సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచుకునేందుకు జగన్ సర్కారు మరో ఎత్తుగడ వేసింది. సాక్షి న్యూస్ పేపర్ కొనాలని వలంటీర్లకు పరోక్షంగా జీవో జారీ అయింది. రాష్ట్రంలో రెండు లక్షల 60 వేల మంది వలంటీర్లుండగా…పేపర్ కొనేందుకు ఒక్కో వలంటీరుకు రూ. 200 మంజూరు చేశారు. అడిషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ పేరుతో వలంటీర్ల పేస్లిప్‌లో రూ. 5 వేలకు అదనంగా ఈ రూ.200 అలాట్ చేశారు.
అంతేకాదు, ఏజెంట్ ఇచ్చిన పేపరు బిల్లును యాప్‌లో అప్లోడ్ చేయాలని వలంటీర్లకు హుకుం జారీ చేశారు. ఇప్పటికే ఏజెంట్లు వలంటీర్ల ఇళ్లకు దినపత్రికను చేరవేస్తున్నారు. అయితే, తమను అడక్కుండా దినపత్రిక ఎలా వేస్తారని కొందరు వలంటీర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. వాలంటీర్లే ‘సాక్షి’గా జనం సొమ్ము జగనన్న దుబారా చేస్తున్న వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది.