తెలంగాణలోని హయత్ నగర్ ప్రాంతంలో నవీన్ అనే యువకుడి హత్య తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన ప్రియురాలితో సన్నిహితంగా ఉంటున్నాడు అన్న ఉద్దేశంతో ఆమె ప్రేమికుడు హరిహర కృష్ణ అతి దారుణంగా నవీన్ ను హత్య చేసిన వైనం షాక్ కు గురిచేసింది. ఇక, ఈ హత్య విషయం హరిహర ప్రియురాలు నిహారిక రెడ్డికి తెలుసని, ఆమెతోపాటు వీరి స్నేహితుడు హసన్ అనే యువకుడికి కూడా తెలుసన్న విషయం వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది.
దీంతో, ఈ కేసులో హరిహరను ఏ1గా, నిహారిక రెడ్డిని ఏ2గా, హసన్ ను ఏ3గా పోలీసులు చేర్చారు. వారిద్దరికీ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించి నిహారికను చంచల్ గూడ జైలుకు, హసన్ ను చర్లపల్లి జైలుకు తరలించారు. గత నెల 17న నవీన్ ను హరిహర అతి కిరాతకంగా చంపిన విషయం నిహారికకు తెలుసని, ఆ హత్య జరిగిన తర్వాత హరిహరను గుడ్ బాయ్ అంటూ నిహారిక మెచ్చుకుందని పోలీసుల విచారణలో వెల్లడైంది.
అంతేకాదు, నవీన్ ను హరిహర హత్య చేసిన ఘటన స్థలానికి నిహారిక రెడ్డి, హరిహర, హసన్ ముగ్గురు వెళ్లారని కూడా పోలీసులు తేల్చారు. అయితే, ప్రధాన మీడియాలో నిహారిక రెడ్డి పేరు పూర్తిగా వేశారు. కానీ, సాక్షి మీడియాలో మాత్రం నిహారిక రెడ్డిలో నుంచి రెడ్డిని తొలగించి కేవలం నిహారిక అని వేయడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతి పేరు అప్రతిష్ట పాలు కాకూడదు అన్న ఉద్దేశంతో జగన్ మీడియా ఇలా చేసిందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా పలు కేసుల్లో ఇరుక్కున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల పేర్ల నుంచి రెడ్డి తోకలను సాక్ష్యి మీడియా కట్ చేసిందని విమర్శలు గుప్పిస్తున్నారు.