ఇప్పుడు ఇండియాలో దాదాపుగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక వర్గం మీడియా అనుకూలంగా ఉంటోంది. అందులో కొన్ని ఓపెన్‌గా ఆ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తుంటాయి. కొన్ని పరోక్ష మద్దతు ఇస్తుంటాయి. కానీ కొన్నిసార్లు ఈ అనుకూల మీడియాతోనే ఎక్కువ ఇబ్బంది ఎదురవుతుంటుంది. స్వామి భక్తిని చాటుకునే క్రమంలో ఈ మీడియా సంస్థలు చేసే అతి వల్ల వాటి వెనుక ఉన్న రాజకీయ నాయకులకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంటుంది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అని వైసీపీ వాళ్లు ఆరోపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ ఇటీవల తన ‘కొత్తపలుకు’లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్ల పుణ్యమా అని తెలుగుదేశం పార్టీకి.. జనసేనకు మధ్య పెద్ద అగాథమే తయారైంది. ఇదిలా ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. ఏపీ సీఎం జగన్‌కు సాక్షి మీడియా ఇంతకంటే పెద్ద నష్టమే చేసేలా కనిపిస్తోంది.
ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి జగన్‌కు ఎలివేషన్ ఇచ్చే క్రమంలో సాక్షి మీడియాలో వచ్చిన ఓ కథనం సోషల్ మీడియాలో పెద్ద ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయింది. జగన్‌ను పొగిడితే పొగడొచ్చు కానీ.. ఆ కథనంలో వ్యాఖ్యానాలు మరీ శ్రుతి మించి కామెడీగా మారాయి. మొత్తంగా ఈ కథనం జగన్‌కు చేసిన మేలు కంటే చెడే ఎక్కువ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పుడేమో జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో సాక్షి మీడియా వ్యవహరిస్తున్న తీరు కూడా జగన్ కొంప ముంచేలా కనిపిస్తోంది. అవినాష్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదని జనాలను నమ్మించే క్రమంలో సాక్షి మీడియా హద్దులు దాటిపోతోంది. ఈ కేసులో పరిణామాలు.. విచారణలో వెలుగు చూసిన నిజాలు అవినాష్‌కు కేసుతో ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని తేటతెల్లం చేశాయి. కానీ అతను మాత్రం చనిపోయిన వ్యక్తి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ.. ఆయన అక్రమ సంబంధాల గురించి మాట్లాడడమే కాక ఆయన పిల్లలే చంపేసినట్లుగా దారుణమైన ఆరోపణలు చేశాడు. దీన్ని సాక్షి మీడియా బాగా హైలైట్ చేస్తోంది.
టీవీ ఛానెళ్లలోనే కాక సోషల్ మీడియాలో కూడా ఈ విషయాల్ని గట్టిగా ప్రచారం చేస్తోంది. ఐతే కేసులో పూర్తిగా ఇరుక్కుపోయినట్లుగా కనిపిస్తున్న అవినాష్.. డెస్పరేషన్లో చేస్తున్నట్లుగా కనిపిస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలు జనాలకు విస్మయం కలిగిస్తున్నాయి. ఈ విషయంలో సాక్షి మీడియాతో పాటు వైసీపీ సోషల్ మీడియా టీం చేస్తున్న అతి వల్ల జనాలకు మరింతగా సందేహాలు బలపడి జగన్ మీద వ్యతిరేకత పెంచేలా కనిపిస్తున్నాయి. వివేకా హత్య జరిగినపుడు సాక్షి మీడియా, వైసీపీ సోషల్ మీడియా జగన్‌కు ఎంతగా ఉపయోగపడ్డాయో, ఆయనకు రాజకీయ ప్రయోజనం చేకూరేలా చేశాయో.. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా జగన్‌కు చేటు చేసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.