ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు న్యూస్ పేపర్ అలవెన్స్ రూపంలో నెలకు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది జగన్ సర్కారు. ఇది కచ్చితంగా జగన్ కుటుంబ పత్రిక ‘సాక్షి’కి మేలు చేకూర్చడానికి తీసుకున్న నిర్ణయమే అన్నది స్పష్టం.
రాష్ట్రంలో 2.66 లక్షల మంది వాలంటీర్లు ఉండగా.. వాళ్లందరూ కూడా వైసీపీ పార్టీ మద్దతుదారులే. కాబట్టి ఆటోమేటిగ్గా అందరూ సాక్షి పత్రికే వేయించుకుంటారు. ఈ రకంగా నెలకు రూ.5 కోట్లకు పైగా బిల్లు పరోక్షంగా సాక్షి ఖాతాకే చేరుతుందన్నది అంచనా. అంతే కాక ఆ పత్రిక సర్క్యులేషన్ పెరిగి యాడ్స్ ధర కూడా పెంచుకునే సౌలభ్యం ఉంటుంది.
దీని మీద ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టినా పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదు. ఐతే సాక్షికి ఇప్పటిదాకా చేకూర్చిన ఆర్థిక ప్రయోజనంతో పోలిస్తే ఇది చాలా చిన్న విషయం అంటోంది ఆంధ్రజ్యోతి పత్రిక. సమాచార హక్కు చట్టం కింద గత మూడేళ్లలో సాక్షి పత్రికకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల విలువ దాదాపు రూ.360 కోట్లని ఆ పత్రిక కథనం ప్రచురించడం గమనార్హం.
ప్రభుత్వ పథకాల గురించి పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం మామూలే కానీ.. అది ప్రధానంగా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీకి ఇస్తారు. ఆ తర్వాత ప్రాధాన్యం వేరే పత్రికలకు ఇస్తారు. కానీ తెలుగులో ‘ఈనాడు’నే అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక అయినప్పటికీ.. ప్రధానంగా ప్రకటనలన్నీ సాక్షికే కట్టబెడు
2019 మేలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు తొలి ఆరు నెలల్లోనే సాక్షికి రూ.30 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చింది. తర్వాతి ఏడాది నుంచి కరోనా విలయ తాండవం చేసి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తలకిందులైనప్పటికీ.. ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున సాక్షికి ప్రకటనలు ఇచ్చారట.
ఈ ఏడాది ఇప్పటిదాకా ప్రకటనల బిల్లు రూ.60 కోట్లు దాటిపోయింది. కేవలం ప్రభుత్వ పథకాల గురించే కాక పెట్రోలు రేట్లు పెరిగినపుడు, ఇంకేదైనా ప్రజల మీద భారం పడ్డపుడు.. ఉద్యోగులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకున్నపుడు వారికి వివరణ ఇస్తూ యాడ్స్ ఇవ్వడం.. ఒక పథకానికి సంబంధించి మూణ్నాలుగు విడతలుగా డబ్బులు వేస్తే.. ప్రతిసారీ దాని గురించి ఊదరగొడుతూ ప్రకటనలు ఇవ్వడం చేస్తోంది జగన్ సర్కారు.
ప్రభుత్వ ప్రకటన లేకుండా సాక్షి పత్రిక మార్కెట్లోకి రావడం అరుదుగా జరుగుతోంది. మెయిన్ పేజీకి ఇచ్చిన యాడ్స్ విలువ రూ.280 కోట్లు కాగా.. జిల్లాల స్థాయిలో ఇంకో వంద కోట్ల మేర యాడ్స్ ఇచ్చారని.. ఇలా మొత్తంగా ప్రజల సొమ్ము రూ.380 కోట్లను సొంత పత్రికకు జగన్ కట్టబెట్టారని ఆంధ్రజ్యోతి కథనంలో పేర్కొన్నారు.