ఇప్పటివరకు సినిమా కథల విషయంలో, కాపీ రైట్ల విషయంలో చాలా వివాదాలు వచ్చాయి. తమ స్టోరీని ఫలానా సినిమాకు వాడేశారని, కనీసం చెప్పలేదని కొందరు సినిమా విడుదలైన తర్వాత కోర్టుకు వెళ్లిన దాఖలాలు అనేకం ఉన్నాయి. అయితే, తాజాగా నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ సినిమాకు కొత్త తరహా చిక్కులు వచ్చిపడ్డాయి. ఆ సినిమాలో తనకు చెప్పకుండా తన ఫొటోను వాడారంటూ నటి, మోడల్ సాక్షి మాలిక్ కోర్టుకెక్టారు.
ఆ కారణంతోనే ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో విడుదలైన ‘వి’ చిత్రాన్ని తొలగించాలని ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి తీసుకోకుండానే ఇన్స్టాగ్రామ్ లోని తన ఫొటోను తీసుకొని ఆ సినిమాలో వాడారంటూ పిటిషన్ వేశారు. అంతేకాకుండా, తన అనుమతి తీసుకోకుండానే ఆ చిత్రంలో ఓ కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా తనను పేర్కొన్నారని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు….కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇది ముమ్మాటికీ సాక్షి మాలిక్ కు పరువు నష్టం కలిగించే అంశమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. 24 గంటల్లో అమెజాన్ నుంచి వి సినిమాను తీసివేయాలని ఆదేశించింది. పిటిషనర్ ఫొటోను బ్లర్ చేయడమో, పిక్సల్స్ పెట్టడమో చేయకూడదని.. పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ సన్నివేశాల్లో మార్పులు చేసే వరకు ఇతర ప్లాట్‌ఫారాల్లో, థియేటర్లలోను.. ‘వి’ సినిమాను ప్రదర్శించొద్దని ఆదేశించింది. ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇంతవరకు స్పందించలేదు.