ప్రస్తుతం మీడియా రంగంలో చాలా పత్రికలు, న్యూస్ చానెళ్లు ఏదో ఒక పార్టీకో, అధికారంలో ఉన్న ప్రభుత్వానికో అండదండలు అందించక తప్పదని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ…చాలా పత్రికలు న్యూట్రల్ గా ఉండడానికి కూడా ప్రయత్నిస్తుంటాయి. కానీ, మన తెలుగు రాష్ట్రాలలోని ఒక పత్రిక మాత్రం ఏ మాత్రం మన ‘స్సాక్షి’ లేకుండా పక్షపాత ధోరణితో వార్తలు రాస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ఫలితంగా ఆ పత్రిక సర్క్యులేషన్ నానాటికీ దిగజారిపోతోందని మీడియా సర్కిళ్లలో ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే సాక్షి పత్రిక సర్క్యులేషన్ ను పెంచేందుకు బంపర్ ఆఫర్ లు ప్రకటిస్తున్నారని టాక్ వస్తోంది. కాపీల సంఖ్య పెరిగితే చాలు అన్న రీతిలో వినూత్న స్కీమ్‌లకు తెర తీస్తోందని తెలుస్తోంది. రూ. వెయ్యి చందా కడితే ఏడాది పాటు సాక్షి పత్రిక వేస్తామంటూ స్కీమ్ లతో ముందుకు వెళుతోందని విమర్శలు వస్తున్నాయి. అయితే, వాస్తవానికి మామూలుగా సాక్షి పత్రిక రేట్ల ప్రకారం సంవత్సర చందా కట్టినా…సుమారు 1500-2000 మధ్యలో ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మరీ 1000 రూపాయలకే సంవత్సర చందా అంటే అస్సలు బాగోదు కాబట్టి అనధికారికంగా ఈ వెయ్యి స్కీమ్ ను ప్రమోట్ చేస్తున్నారట.
ప్రభుత్వ అనుబంధ సంస్థలు, కార్పొరేషన్లు, ముఖ్యమైన సంస్థల్లో పని చేసే వారు, చదువుకునే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ ఆఫర్ అంటూ ప్రమోట్ చేస్తున్నారట. ప్రభుత్వ అనుబంధ కాలేజీలు, యూనివర్శిటీల్లో విద్యార్థులకు ఈ ప్రకారం ఆఫర్ సర్క్యులర్ కూడా వెళ్లిందట. రూ. వెయ్యి చందా కడితే నేరుగా ఇంటికే పేపర్ పంపుతామని స్వయంగా ప్రిన్సిపల్స్ ఆ ఆఫర్ గురించి ప్రచారం చేస్తున్నాట.
ఇక, సదరు ప్రిన్సిపాల్స్ పై పై స్థాయిలో ఒత్తిడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక, ఫీజు రీఇంబర్స్ మెంట్, ఇతర పథకాలు పొందే వారు పేపర్ వేయించుకోకపోతే పథకాలు కట్ అవుతాయనే అనధికారిక ప్రచారంతో వారంతా చచ్చినట్లు ఆ స్కీమ్ లో చేరుతున్నారట. కార్పొరేషన్లలో ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్‌పై కూడా ఈ స్కీమ్ ను రుద్దబోతున్నారట.
వాస్తవానికి రూ. 1000కే సంవత్సరం మొత్తం పేపర్ వేయడం వల్ల సాక్షికి చాలా నష్టం. కేజీ వేస్ట్ పేపర్ కూడా దాదాపు 40 రూపాయలుంటుంది. దీంతో, సాక్షి పత్రిక సంవత్సరం మొత్తం కలెక్ట్ చేసి కిలోల లెక్కన అమ్మినా…ఆ వెయ్యి వచ్చేస్తుంది. కానీ, సర్క్యులేషన్ గేమ్ లో నిలవడానికి తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ బంపర్ ఆఫర్ లను ప్రకటిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నష్టాలను ఎలాగోలా భర్తీ చేసుకోవచ్చని, కానీ, సర్క్యులేషన్ రేసులో వెనుకబడితే ఇప్పటికే వీక్ మీడియాగా పేరుపడ్డ సాక్షి మరింత వీక్ అవుతుందని ఇలా ఆఫర్లు ప్రకటిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.