ఉద్యోగుల డిమాండ్లపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది…ఉద్యోగులే ముందుకు రావడం లేదు…ఇది ప్రభుత్వం తరఫున చర్చలకు వకాల్తా పుచ్చుకున్న సజ్జల చెబుతున్న మాట. అయితే, ఇన్ని సార్లు చర్చలు జరిపినా ఈ సమస్య ఇంకా జటిలంగా మారుతోందే తప్ప దానికో పరిష్కారం ఎందుకు లభించడం లేదన్నది సగటు ఆంధ్రుడి మెదడును తొలిచేస్తున్న భేతాళ ప్రశ్న. ప్రభుత్వ పెద్దలు చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ…ఉద్యోగులే సమ్మె, సభ అంటూ తిరుగుతున్నారన్న టాక్ కూడా జనాల్లో ఉంది.
కానీ, అసలు చర్చల్లో జరుగుతోందేంటి? చర్చలకని పిలిచి లోపల ఏం మాట్లాడుతున్నారు? ఎందుకని ఈ చర్చలు నాలుగైదు సార్లు జరిగినా సఫలం కాలేదు…అన్న ప్రశ్నలకు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన సమాధానం వింటే…ఇది నిజమా అనిపించక మానదు. సజ్జలతో జరుగుతున్న చర్చల లోగుట్టును ఉద్యోగ సంఘం నేతలు ఓ డిబేట్ లో మీడియా సాక్షిగా వెల్లడించారు.
చర్చల వ్యవహారంలో సజ్జల తీరును ఉద్యోగుల ఎండగట్టిన వైనం వారి మాటల్లోనే…
”అసలు చర్చలు జరగవు…వారు చర్చలు చేయరు…మీకేమైనా కావాలంటే చెప్పండి…వీలైతే చేద్దాం…అని అంటారు. మమ్మల్ని పిలిచి చాయ్ బిస్కట్ ఇచ్చి అవమానకరంగా పంపుతున్నారు… చర్చలకు మేము రెడీగానే ఉన్నాం.. అసలు మమ్మల్ని చర్చలకు పిలవలేదు ఆయన. ఇదంతా భయంకరమైనది.. ఒట్టిది..లోపలకొస్తే తెలుస్తుంది అక్కడేం జరుగుతోందో…బయట చెప్పే మాట వేరు లోపల చేసేది వేరు…ఇదంతా అబద్ధం…ఎవరినైనా రమ్మనండి…రవి చంద్రారెడ్డిగారినైనా రమ్మనండి….”అంటూ ఉద్యోగులు సజ్జల చర్చల సీక్రెట్ ను బయటపెట్టారు.