సీఎం జగన్ చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసు సినీ థ్రిల్లర్ ను తలపించేేలా ఏపీ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఇటీవల హైదరాబాద్ లో సీబీఐ అధికారులు విచారణ జరిపిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి ఫోన్ డేటా ఆధారంగా మరో ఇద్దరిని తాజాగా సీబీఐ అధికారులు విచారణ జరిపారు. సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణి వైఎస్ భారతి పీఏ నవీన్ లను సీబీఐ అధికారులు విచారణ జరిపారు.
కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో దాదాపు ఆరున్నర గంటల పాటు వారిద్దరినీ సీబీఐ విచారణ జరిపింది. కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించినతర్వాత నవీన్ ను అధికారులు ప్రశ్నించారు. నవీన్ ను రహస్యంగా విచారణ జరిపినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ విజయవాడ వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆ విచారణ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసులో అవినాష్ రెడ్డి తర్వాత నవీన్ కు నోటీసులిచ్చారని, దాంతో నవీన్ ఎవరోనంటూ ఏదేదో ప్రచారం చేశారని సజ్జల అసహనం వ్యక్తం చేశారు. హత్య విషయం ముందుగా తెలిసింది వివేకా అల్లుడు, బావమరిదికేనని సజ్జల అన్నారు. ఆ హత్య విషయం ఆయన బావమరిది ద్వారా అవినాశ్ రెడ్డికి తెలిసిందని అన్నారు. వివేకా మృతి అనుమానాస్పదంగా ఉందని తెలిసినా,వివేకా అల్లుడు, బావమరిది ఎందుకు పోలీసులకు సమాచారం అందించలేదని ప్రశ్నించారు.
వివేకా చనిపోయిన విషయాన్ని జగన్ కు చెప్పేందుకు కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లకు అవినాష్ రెడ్డి ఫోన్ చేసి ఉంటాడని అన్నారు. చంద్రబాబుకు ఏదైనా విషయం తెలియాలన్నా ఎవరో ఒకరికి వేరొకరు ఫోన్ చేయాల్సిందే కదా అని సజ్జల చెప్పారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సజ్జలపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. వివేకా కేసులో ఈ పసలేని లాజిక్కులతో అవినాష్ రెడ్డికి వకాల్తా తీసుకొని సజ్జల భలే కవర్ చేశాడే అంటూ కామెంట్స్ వస్తున్నాయి.