ఎవరు అవునన్నా.. కాదన్నా ఏపీ అధికారపక్షంలో జగన్ తర్వాతి రెండు స్థానాల్లో సజ్జల ఉంటారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. రాజకీయాల్లో దశాబ్దాల నుంచి ఉన్నా.. సజ్జల మాదిరి చక్రం తిప్పే అవకాశం రాలేదంటూ తమ ప్రైవేటు సంభాషణల్లో వాపోతుంటారు పలువురు రాజకీయ నేతలు. సీఎం జగన్ లాంటి పవర్ ఫుల్ సీఎం మనసును దోచేయటమే కాదు.. ఆయన మాటలకు ఇచ్చే గౌరవ మర్యాదల గురించి అబ్బురంగా మాట్లాడుకుంటూ ఉంటారు. దీనికో కారణం చెబుతుంటారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరూ అట్టే నచ్చరని.. ఒకవేళ నచ్చి దగ్గరకు తీసినా.. అదెంత కాలం? అన్న దానిపై బోలెడన్ని లెక్కలు ఉంటాయని చెబుతారు.
గడిచిన నాలుగేళ్ల జగన్ పాలనతో ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పలు పేర్లు తెర మీదకు రావటం.. కొంత కాలం వారి హవా నడవటం.. ఆ తర్వాత వారు తెర వెనక్కి వెళ్లిపోవటం తెలిసిందే. సజ్జల విషయంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి సజ్జల నోటి నుంచి వచ్చిన ఒక మాటను సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఓపెన్ గా తప్పు పట్టటమే కాదు.. ఆయన చేసిన వ్యాఖ్య కారణంగా పార్టీకి జరిగే నష్టాన్ని చెప్పిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సజ్జలను ఉద్దేశించి ఒక చిన్న మాట పొరపాటుగా ఎవరైనా నోటి నుంచి వస్తే.. దానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తారని చెబుతారు. అలాంటి సజ్జల మీద.. ఆయన చేసిన పొలిటికల్ కామెంట్ మీదా తప్పును ఎత్తి చూపటమే కాదు.. ఇలాంటి వాటితో పార్టీకి వాటిల్లే నష్టం ఎంతన్న విషయాన్ని చెప్పిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఆ సందర్భం ఏమిటి? సజ్జల ఏమన్నారు? దానికి బొత్స ఏమని రియాక్టు అయ్యారు? మొత్తంగా ఈ ఎపిసోడ్ పరమార్థం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
రెండు.. మూడు రోజుల క్రితం ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు కూడా త్వరలో అరెస్టు అవుతారని వ్యాఖ్యానించటం సంచలనంగా మారింది. దీనిపై రాజకీయదుమారం రేగింది. విపక్షాలు విరుచుకుపడితే.. అధికార పక్షం నేతలు ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వటం తెలిసిందే. అయితే.. వీరందరికి మించి సీనియర్ మంత్రి బొత్స సత్యానారాయణ కాస్త భిన్నంగా రియాక్టు అయ్యారు. సజ్జల అలా కామెంట్ చేయటం తనకు నచ్చలేదన్న ఆయన.. ఆయన తరహాలో అయితే తాను కామెంట్లు చేయనని తేల్చారు.
అంతేకాదు.. ‘‘పూర్తి ఆధారాలు ఉంటే ఎవరికైనా చట్టం వర్తిస్తుంది. ఎవరూచట్టానికి అతీతులు కాదు. ఆ పరిస్థితి లేదు. అలాంటిది చంద్రబాబు అయినా వేరే వారు అయినా సరే చట్టం అందరికి వర్తిస్తుంది. రాజకీయంగా ఉన్నత స్థానాల్లో వారు ఇలాంటి కామెంట్స్ చేయటం ద్వారా చంద్రబాబుకు రాజకీయప్రయోజనాల్నికలిగించినట్
చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్టు చేస్తామని.. రాజకీయంగా అధికారంలో ఉన్న నేతలు ప్రకటిస్తే.. దాన్ని తన అవసరానికి వినియోగించుకొని సానుభూతి క్రియేట్ చేసుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్న బొత్స మాటల్ని చూస్తే.. సజ్జలను గురి చూసి కొట్టారన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. ఎంత చెప్పినా.. మరెంత ప్రాధాన్యతను ఇచ్చినా తమకు మాదిరి సజ్జల రాజకీయనాయకుడు కాదన్నవిషయాన్ని బొత్స తన మాటలతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
విచారణ చేసిన అధికారులు తమ దర్యాప్తులో లభించిన ఆధారాల ప్రకారం పని చేస్తారని.. చట్టం తన పని తాను చేసుకుంటూందని ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్న మాట బొత్స నోటి నుంచి వచ్చింది. అనవసరంగా ఎదుటి వారికి అవకాశాల్ని మనమే క్రియేట్ చేసి చేతుల్లో పెట్టే పద్దతి తనది కాదన్న మంత్రి మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సజ్జల లోపాన్ని ఇంతలా విప్పి చెప్పేసినోళ్లు వారు పార్టీలో లేరని.. ఆ లోటును బొత్స తాజా ఎపిసోడ్ తో తీర్చారన్న మాట వైసీపీలో వినిపించటం దేనికి నిదర్శనం? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.