ఏపీలో పీఆర్సీ వ్యవహారంపై జరుగుతున్న చర్చల్లో, రచ్చలో ప్రముఖంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. మామూలుగా అయితే, ఇటువంటి వ్యవహారాల్లో కుదిరితే ముఖ్యమంత్రి మాట్లాడతారు. లేదంటే, ఆర్థిక శాఖా మంత్రి, సీఎస్, సంబంధిత అధికారులు, రెవెన్యూ శాఖా మంత్రి మాట్లాడతారు. కానీ, ఏపీలో మాత్రం ప్రభుత్వానికి ఏ సమస్య వచ్చినా…జగన్ కు మైక్ లాగా…అనధికారిక సీఎంగా సజ్జల మీడియా ముందు ప్రత్యక్షమవుతుంటారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తుంటారు. అయినా సరే, సజ్జల మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా స్టీరింగ్ కమిటీ నేతలతో సమావేశమైన తర్వాత సజ్జల షాకింగ్ కామెంట్లు చేశారు. పాత పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చే సమస్యే లేదని మరోసారి తేల్చి చెప్పారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పడుతున్నాయని, అటువంటి సమయంలో పాత జీతాలు సాధ్యం కాదని ఉద్యోగ సంఘాల నేతలకు కరాఖండిగా చెప్పేశారు. యథా ప్రకారం ఉద్యోగసంఘాల ప్రతిపాదనలను అంశాలవారీగా పరిశీలిస్తామని చెప్పిన సజ్జల….చలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని వారిని కోరారు. ఓ పక్క ప్రభుత్వంతో చర్చలు అంటూ మరో పక్క సమ్మె, ఉద్యమం అంటే ప్రతిష్టంభన ఏర్పడుతుందని సజ్జల అభిప్రాయపడ్డారు.
అయితే, ఛలో విజయవాడ కార్యక్రమం కొనసాగుతుందని ఉద్యోగులు చెప్పారని, వారి కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోదని సజ్జల చెప్పారు. కానీ, కరోనా నిబంధనలను ఉద్యోగసంఘాలు గుర్తుంచుకోవాలని, ఛలో విజయవాడ కార్యక్రమం కంటే ముందే సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని అన్నారు. జీతాల్లో ఎక్కడా రికవరీ లేదని, ఐఆర్ అనేది తాత్కాలిక అడ్జెస్ట్మెంట్ మాత్రమేనని, అది రీ అడ్జెస్ట్ అవుతుందని చెప్పారు. ఉద్యోగసంఘాల నేతలను మంత్రులు బెదిరిస్తున్నారనడం అవాస్తవమని, హైకోర్టు ఆదేశాలను ఉద్యోగులు కూడా పరిగణనలోకి తీసుకుని తమ కార్యాచరణను వాయిదా వేసుకోవాలని అన్నారు. జీతాల విషయంలో తొందర ఎందుకని, సాయంత్రానికి అందరికీ జీతాలు వేస్తున్నామని చెప్పారు. అయితే, సమస్యల పరిష్కారం తర్వాతే తమ కార్యాచరణపై చర్చిస్తామని స్టీరింగ్ కమిటీ సభ్యులు సజ్జలకు తేల్చిచెప్పారు.