విజయసాయిరెడ్డి…రాజ్యసభ సభ్యుడిగా నేడు అందరికీ సుపరిచితుడైన ఆయన…వైఎస్ జగన్ కు ఒకానొక సమయంలో అత్యంత ఆప్తుడు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంట నీడలా ఆయనకు తోడుగా విజసాయిరెడ్డి ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే జగన్ తో సాన్నిహిత్యాన్ని జైలు లోనూ కొనసాగించేంత త్యాగం చేసిన వ్యక్తి విజయసాయి. జగన్ జైల్లో ఉండగా…షర్మిల వెంట నడిచి పార్టీని నడిపిన రికార్డు విజయసాయిది.
అందుకు తగ్గట్లే ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నపుడు, అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కూడా పార్టీలో వి.సా.రెడ్డి నెంబర్ 2గా కొనసాగారు. అయితే, ఏమైందో ఏమో తెలీదు..హఠాత్తుగా జగన్ కు విజయసాయికి మధ్య గ్యాప్ పెరిగిందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, అవేవో గాలి వార్తలు అని కొట్టిపారేయలేని రీతిలో ఉండడంతో వారి మధ్య ఏదో జరిగిందని పార్టీలోనూ చర్చించుకున్నారు. అయిేత, కొన్ని నెలల గ్యాప్ తర్వాత ఈ మధ్యకాలంలో విజయసాయికి, జగన్ కు మధ్య ప్యాచప్ అయినట్లు కనిపించినా…ఆ గ్యాప్ తగ్గలేదనేందుకు తాజా కేబినెట్ కూర్పే నిదర్శనం.
విజయసాయికి ప్రాధాన్యం తగ్గడం..అదే సమయంలో సజ్జల ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ఓ రకంగా చెప్పాలంటే విజయసాయి స్థానాన్ని సజ్జల భర్తీ చేశారు. చాలాకాలంగా జగన్ తర్వాత నంబర్ 2గా సజ్జల కొనసాగుతున్నారన్నది నిర్వివాదాంశం. జగన్ కు మైక్ గా సజ్జల మారారని, ఉద్యోగుల సమ్మె మొదలు తాజాగా మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలో జగన్ తో చర్చించే స్థాయికి సజ్జల ఎదిగారని అంటున్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కీలకంగా వ్యవహారించిన విజయసాయి…మంత్రుల ఎంపిక విషయంలో జోక్యం చేసుకోకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలోనే తన వర్గానికి మంత్రి పదవులు కట్టబెట్టడంలో సజ్జల కీలకంగా వ్యవహారించారనే టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో, ప్రభుత్వంలో విజయసాయి ప్రాధాన్యత తగ్గడానికి, సజ్జల శక్తివంతమైన వ్యక్తిగా మారడానికి కారణాలపై చర్చ జరుగుతోంది. సాయిరెడ్డి సూచించిన ఒక్క ఎమ్మెల్యేకు కూడా జగన్ మంత్రి పదవి ఇవ్వలేదన్న టాక్ వస్తోంది.
ఇక, పదవి దక్కని అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను కూడా సజ్జలకే అప్పజెప్పడంతో విజయసాయి పాత్ర తేలిపోయింది..పార్టీలో తన మాటకు అంతగా ప్రాధాన్యం దక్కడం లేదని విజయసాయి తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. అందుకే విజయసాయి అమరావతికి రాకుండా విశాఖపట్నం, హైదరాబాద్ కే పరిమితమవుతున్నారని.. లేదంటే ఢిల్లీలో పనులు చక్కబెట్టుకుంటూ అక్కడే ఉండిపోతున్నారని తెలుస్తోంది. ఇంతకీ, విజయసాయిని జగన్ దూరం పెట్టడానికి కారణం మాత్రం భేతాళ ప్రశ్నే.