వైసీపీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే.. మంత్రి వర్గంలో చేరేందుకు పాట్లు పడుతున్నారా? తనదైన శైలిలో ప్రభుత్వంలోని కీలక నేతలను కాకా పడుతున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎవరిని ఎక్కడ ఎలా కొట్టాలో అలా కాకా పట్టేస్తూ ఆమె చేస్తోన్న లాబీయింగ్ మామూలుగా లేదని వైసీపీ వాళ్లే విస్తుపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు… సజ్జల రామకృష్ణారెడ్డికి సీఎం జగన్ దగ్గర చాలా చనువు ఉంది. దీంతో ఇప్పుడు మంత్రి పీఠాలు కోరుకునే వారు.. సజ్జలను కాకా పడుతున్నారు. ఈ క్రమంలోనే సదరు మహిళా ఎమ్మెల్యే ఇప్పుడు సజ్జలతో వరుసగా భేటీ కావడం.. ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంకా చెప్పాలంటే సజ్జల ఎటు వెళితే సదరు మహిళా ఎమ్మెల్యే కూడా అటు వైపు చక్కెర్లు కొడుతున్నారట.
గత ఎన్నికలకు ముందు హఠాత్తుగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఈ నేత.. వైసీపీలో అనూహ్యంగా టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. అయితే.. ఆది నుంచి ఫైర్ బ్రాండ్‌గా పేరు సంపాయించుకున్న ఈనేతకు పార్టీలో పాతతరం కంటే.. కొత్త తరంతోనే పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఎక్కువగా ఈ నేత కొత్తవారితోనే కలిసి కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటిగా మారింది. అదేసమయంలో తన మాటే చెల్లాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండడం కూడా పార్టీలో నిరంతరం చర్చనీయాంశంగా మారింది. ఆర్థికంగా ఆమె అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆమె ఎవరికి పడితే వారికి డబ్బులు విసిరేస్తున్నారన్న టాక్ కూడా ఉంది.
ఆమె ప్రాధినిత్యం వహిస్తోన్న నియోజకవర్గంలో తన మాటే చెల్లాలనే పట్టుదలతో వ్యవహరించే ఆమె మహిళ కావడంతో పాటు సామాజిక సమీకరణలు కూడా కలిసి వస్తున్నాయి. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు కేబినెట్లో ఉన్నారు. వీరిని కనుక రేపు మంత్రి వర్గ ప్రక్షాళనలో తొలిగిస్తే.. తనకు దక్కించుకునేందుకు ఈ నేత కీలక ప్రయత్నం చేస్తున్నారని.. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సదరు నేత సజ్జల ద్వారా చేస్తోన్న లాబీయింగ్ మామూలుగా లేదని వైసీపీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.
ఈ లాబీయింగ్ వల్లే నియోజకవర్గంలో తనకు అడ్డొస్తారని ఓ సీనియర్ నేతకు జగన్ హామీ ఇచ్చిన పదవి కూడా దక్కకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. మంత్రి పదవి రావడం సంగతి ఎలా ? ఉన్నా ఆమె ఊపు.. చేస్తోన్న ప్రయత్నాలు… బయట జరుగుతోన్న ప్రచారం మాత్రం ఆమె జగన్ కేబినెట్లో కూర్చొన్నట్టే ఉంది.