మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నేడు రెండోసారి సిబిఐ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. వివేకా హత్య వెనుక ఉన్న కుట్రంతా అవినాష్ రెడ్డికి తెలుసని, అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇళ్ల నుంచే నిందితులు స్కెచ్ వేశారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అమాయకుడంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసు దాదాపు ముగింపు దశకు వచ్చింది అనుకుంటున్న తరుణంలో సజ్జల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదంటూ సజ్జల ఆరోపించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, ఈ కేసులో కొందరిని టార్గెట్ చేస్తూ విచారణ జరుపుతున్నారని సజ్జల ఆరోపించారు. వివేకా కాల్ డేటా ఎందుకు డిలీట్ చేశారని, వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఫోన్ రికార్డులు ఎందుకు అధికారులు చూడలేదని ప్రశ్నించారు.
వివేకా కుటుంబంలో విభేదాలున్నాయని, వివేకా హత్యతో అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని సజ్జల అన్నారు. వివేకా బావమరిది ఫోన్ చేసి చెప్తేనే ఆయన వెళ్లారని, అవినాష్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్టుగా ఎటువంటి ఆధారాలు లేవని సజ్జల అన్నారు. వివేక మర్డర్ తో బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలకు సంబంధాలున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. వివేక గుండెపోటుతో చనిపోయారని తనకు శివశంకర్ రెడ్డి ఫోన్ చేసి చెప్పినట్టుగా ఆదినారాయణ రెడ్డి గతంలో వెల్లడించారని అన్నారు.
వివేకా హత్య ద్వారా జగన్ ను నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వివేకాను కోల్పోవడం జగన్ కు, వైసీపీకి దెబ్బని, ఆయన తిరిగి పార్టీలోకి వచ్చి ఉంటే జగన్ ఆహ్వానించే వారని చెప్పారు. వివేకాను చంపిన అసలు హంతకులను పట్టుకోవాలని సజ్జల డిమాండ్ చేశారు.