వైసీపీ కీలక నాయకుడు, ఎంపీ.. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలు.. ఎంపీల పీఏలు కూడా గడపగడపకు కార్యక్రమంలో తిరగాలని ఆయన హుకుం జారీ చేశారు. ఇది ఇప్పుడు తీవ్ర వివాదంగా మారుతోంది.
గత నెల 11వ తేదీ నుండి నిర్వహిస్తున్న “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో శాసన సభ్యులు, ఎంపీలు, మంత్రులు పాల్గొంటున్నారు. చాలా చోట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రజలతో చీవాట్లు కూడా తింటున్నారు. దీంతో చాలా మంది మంత్రులు.. ఏదో ఒక వంక పెట్టుకుని ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
అయితే.. ఇప్పుడు.. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల వ్యక్తిగత సహాయకులు(PA) కూడా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మమేకం కావాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంపై “ఎమ్మెల్యేల వ్యక్తిగత సహాయకుల(PA) అవగాహనా కార్యక్రమం” జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ముంగిటకే నేరుగా ప్రభుత్వం వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వెనువెంటనే పరిష్కరించే మహోన్నత కార్యక్రమం “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం అని ఆకాశానికి ఎత్తేశారు.
శాసన సభ్యులు తమ నియోజక వర్గ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో గల ప్రతి ఇంటిని సందర్శించేందుకు కనీసం మూడు రోజుల పాటు ప్రతి సచివాలయ పరిధిలో పర్యటిస్తారన్నారు. ఈ విధంగా శాసన సభ్యులు నెలలో కనీసం 20 రోజుల పాటు “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్కొంటారన్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల వ్యక్తిగత సహాయకులు(PA) కీలక పాత్రపోషించాలన్నారు.
ఈ కార్యక్రమానికి సంబందించి పర్యటన షెడ్యూలును, వాటిలోని మార్పులు, చేర్పులను ముందస్తుగా ఖరారు అయ్యేలా చూడాలని, సదరు షెడ్యూలును సంబందిత అధికారులకు అందరికీ పంపే బాధ్యత ఎమ్మెల్యేల వ్యక్తిగత సహాయకుల(PA) పై ఉందన్నారు.
పర్యటన సమయంలో ప్రభుత్వం పథకాలు, ప్రభుత్వేతర పథకాలకు సంబందించి ప్రజల నుండి వచ్చే విజ్ఞాపనల్లోని అత్యంత ప్రాధాన్యత అంశాలను గుర్తించి వాటిని అధికారుల దృష్టికి వచ్చేలా చూడాలన్నారు. వ్యక్తిగత సహాయకులు ఎప్పటి కప్పుడు అందజేసే తాజా సమాచారాన్ని క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తదనుగుణంగా ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.
“గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం సందర్బంగా నిర్వహించే పర్యటనల్లో స్థానిక గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరూ పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల వ్యక్తిగత సహాయకుల(PA) పై ఉందన్నారు. ఇందుకు తగ్గట్టుగా వారికి ముందుగానే పర్యటన షెడ్యూలును పంపి వారంతా ఈ కార్యక్రమంలో మమేకం అయ్యేలా చూడాలన్నారు. మొత్తానికి పీఏలను కూడా ఇంటింటికీ తిప్పాలన్న వ్యూహంపై వైసీపీలోనే లుకలుకలు వినిపిస్తున్నాయి. “ఇదేంది సాయిరెడ్డీ..“ అంటూ పెదవి విరుస్తున్నారు.