టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో హీరోయిన్ సాయి పల్లవికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కేవలం స్కిన్ షోనే నమ్ముకొని చాలామంది హీరోయిన్లు రాణిస్తోన్న ఈ జనరేషన్ లో తన అందం, అభినయంతో అలరిస్తోన్న ఈ తమిళమ్మాయికి యూత్ ఫిదా అయిపోయారు. శేఖర్ కమ్ముల , సాయి పల్లవిల కాంబోలో వచ్చిన ఫిదా చిత్రంలో వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే అంటూ సాయి పల్లవి వేసిన స్టెప్పులకు కుర్రకారు ఫిదా అయిపోయారు.
ఆ పాటకు యూట్యూబ్ లో ఈ రోజు వరకు 29 కోట్ల వ్యూస్ వచ్చి ఆల్ టైం బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. ఇపుడు తాజాగా వీరిద్దరి కాంబోలో రాబోతోన్న లవ్ స్టోరీ చిత్రం నుంచి కూడా ఇదే తరహాలో సారంగ దరియా అంటూ విడుదలైన తెలంగాణ జానపదం….యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. సమంత చేతుల మీదుగా విడుదలైన సారంగ దరియా లిరికల్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది. 24 గంటల్లోనే 6 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.
”దాని కుడీ భుజం మీద కడవా, దాని గుత్తెపు రైకలు మెరియా, అది రమ్మంటె రాదుర సెలియా.. దాని పేరే సారంగ దరియా” అంటూ జానపద సాహిత్యంతో వచ్చిన ఈ పాటలో తన స్టెప్పులతో సాయి పల్లవి అదరగొట్టింది. నెమలిలా నాట్యం చేస్తోన్న సాయి పల్లవి ఆటకు….తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ పాట తోడవడంతో….కుర్రకారంతా సారంగ దరియాకు ఫిదా అయ్యారు. పాట విడుదలైన 24 గంటల్లోనే దాదాపు 60 లక్షల వ్యూస్, 3 లక్షల లైకులు వచ్చాయంటే ఆ పాట జనాన్ని ఎంతగా ఆకట్టుకుందే ఇట్టే అర్థమవుతుంది. సాయి పల్లవి మెస్మరైజింగ్ డ్యాన్స్… సుద్దాల అశోక్ తేజ లిరిక్స్….మంగ్లీ మ్యాజిక్ వాయిస్.. శేఖర్ మాస్టర్ స్టెప్పులు….ఈ పాటను ఓ రేంజ్ లో నిలబెట్టాయంటే అతిశయోక్తి కాదు.
అయితే, సారంగ దరియా పాట కూడా కాపీ అని నెటిజన్లు అంటున్నారు. సారంగ దరియా ఒరిజినల్ వెర్షన్ అయిన తెలంగాణ జానపద గీతాన్ని రేలారే రేలా కార్యక్రమంలో చాలా ఏళ్ల క్రితమే ఓ యువగాయని పాడిందని, దీని, ఒరిజినల్ లిరిక్స్ కాపీ రైట్లు వేరేవారివని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పల్లవిని మాత్రం యథాతధంగా తీసుకున్నారని, చరణాలు మార్పు చేశారని అంటున్నారు. మరి, ఈ కాపీ రైట్ వ్యవహారంపై సుద్దాల అశోక్ తేజ, శేఖర్ కమ్ముల ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.