సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ సాయిపల్లవికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. సినిమా రంగాన్ని హీరోయిన్ల గ్లామర్, స్కిన్ షో శాస్తిస్తున్న ఈ రోజుల్లో…అందం, అభినయంతోనూ స్టార్ హీరోయిన్ గా రాణించవచ్చని నిరూపించిన నటి. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే సాయి పల్లవి…సినిమా ప్రమోషన్ల సమయంలో మాత్రం మీడియా ముందు యాక్టివ్ గా కనిపిస్తుంటుంది.
సోషల్ మీడియాలోనే లో ప్రొఫైల్ మెయింటెన్ చేసే సాయిపల్లవి…రాజకీయాల గురించి అస్సలు మాట్లాడిన దాఖలాలు లేవు. అటువంటి సాయి పల్లవి తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. జమ్మూకశ్మీర్ లో ఊచకోతకు గురైన కశ్మీరీ పండిట్ల గురించి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మతం పేరుతో జరిగే హింసకు తాను వ్యతిరేకమని చెప్పిన సాయి పల్లవి…కశ్మీరీ ఫైల్స్ సినిమాపై స్పందించిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
‘గతంలో కశ్మీరీ పండిట్లను ఎలా చంపారనే విషయాన్ని ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో చూపించారు. ఈ విషయాన్ని మీరు మతపరమైన సంఘర్షణగా చూస్తున్నట్టయితే… అలాంటిదే ఇటీవల మరొక ఘటన జరిగింది. తన వాహనంలో ఆవులను తీసుకెళ్తున్న ఒక ముస్లిం వ్యక్తిపై దాడి చేశారు. జైశ్రీరాం అని నినదిస్తూ అతనిపై దాడికి పాల్పడ్డారు. అప్పుడు కశ్మీరీ పండిట్లపై జరిగిన దానికి, ఇప్పుడు ముస్లిం వ్యక్తిపై జరిగిన దానికి తేడా ఏముంది?’ అని ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి.
అయితే, సోషల్ మీడియాలో సాయి పల్లవి వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఒక జాతిపై జరిగిన మారణహోమానికి, ఆవులను రక్షించేందుకు జరిగిన దాడికి తేడా లేదా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సాయి పల్లవి మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని, జాతి, మత భేదాలు లేకుండా ఇటువంటి దాడులను ఖండించాలని, గుజరాత్ ఊచకోతైనా…కశ్మీరీ పండిట్ల మారణ హోమమైనా, ఆవుల పేరుతో హత్యలైనా, ఖండించాల్సిందేనని అంటున్నారు. ఇక, జాతీయ మీడియా సైతం సాయి పల్లవి వ్యాఖ్యలకు సంబంధించిన కథనాలను ప్రసారం చేస్తుండడంతో ఈ వ్యవహారం వైరల్ అయింది.