న్యాచురల్ బ్యూటీ అనగానే గుర్తుకువచ్చే పేరు సాయి పల్లవి. నేటి తరం హీరోయిన్లంతా గ్లామర్ పుంతలు తొక్కుతుంటే.. ఒక్క సాయి పల్లవి మాత్రం అటు ఆన్ స్క్రీన్‌లోనూ, ఇటు ఆఫ్ స్క్రీన్‌లోనూ నిండైన దుస్తుల్లో కనిపిస్తూ అలరిస్తోంది. తనదైన నటన, డ్యాన్సులతో ప్రేక్షకుల హృదయాల్లో చెరుగని ముద్ర వేసింది. లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు పొందింది. గత ఏడాది `అమరన్` మూవీతో బిగ్ హిట్ ను అందుకున్న సాయి పల్లవి.. రీసెంట్ గా `తండేల్`తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
అయితే వరుస విజయాల నేపథ్యంలో సాయి పల్లవి రెమ్యునరేషన్ చుక్కలను తాకిందనే న్యూస్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో రెండు బాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి జునైద్ ఖాన్ మూవీ కాగా.. మరొకటి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న `రామాయణ`. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతుంది.
ఫస్ట్ పార్ట్ షూటింగ్ గత ఏడాదే ప్రారంభమైంది. అయితే రామాయణ పార్టీ 1 కోసం సాయి పల్లవి ఏకంగా రూ. 15 కోట్లు పారితోషికం అందుకుంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఈ సౌత్ హీరోయిన్ ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోలేదు. లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం తన బాలీవుడ్ డెబ్యూ అయిన `జవాన్` కోసం రూ. 12 కోట్లే ఛార్జ్ చేసింది. ఈ లెక్కన పారితోషికం పరంగా అగ్రస్థానంలో ఉండే నయన్ ను సాయి పల్లవి బీట్ చేసిందనే చెప్పుకోవచ్చు.
అయితే సాయి పల్లవి ఇకపై చేయబోయే ప్రతి సినిమాకు అంతే మొత్తంలో ఛార్జ్ చేస్తుందా? అలా చేస్తే మనోళ్లు ఆమెను తట్టుకోగలరా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి సాయి పల్లవి డబ్బు కంటే సినిమాకే ఎక్కువ వ్యాల్యూ ఇస్తుంది. సినిమా ఫ్లాప్ అయినప్పుడు తన రెమ్యునరేషన్‌ను వెనక్కి ఇచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. `ఎవరు ఇవ్వగలుగుతారో వారి దగ్గరే తీసుకుంటాను.. ప్రతి సినిమాకు హే ఇంత ఇవ్వండి అంటే అది మూవీ బడ్జెట్లోనే సగం వెళ్లిపోతుంది.. అది తప్పు` అని అంటోంది సాయి పల్లవి.