`విరూపక్ష`, `బ్రో` చిత్రాలతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడమే కాకుండా 100 కోట్ల క్లబ్లో చేరిన మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన 18వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రోహిత్ కేపీ దర్శకుడు. ఈ మూవీ గురించి పక్కన పెడితే.. తాజాగా తేజ్ మరో బిగ్ ప్రాజెక్ట్ లో భాగం అయ్యాడు. అదే `విశ్వంభర`. తన మామయ్యలతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని తేజ్ ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు.
ఇప్పటికే నాగబాబుతో పాటు `బ్రో` మూవీలో చినమామ పవన్ కళ్యాణ్ తో తెర పంచుకున్న తేజ్.. ఇప్పుడు పెదమామ చిరంజీవితో కలిసి నటించబోతున్నాడట. `బింబిసార` ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్న సోసియో-ఫాంటసీ చిత్రమిది. ఇందులో త్రిష హీరోయిన్. అత్యంత భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న విశ్వంభరలో చిరుతో కలిసి యాక్ట్ చేసే లక్కీ ఛాన్స్ ఆయన మేనల్లుడు సాయి దుర్గ తేజ్ కు వచ్చిందట.
అయితే ఈ సినిమాలో తేజ్ ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం లేదు. గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడట. హైదరాబాద్ సిటీలో జరుగుతున్న విశ్వంభర షూటింగ్ లో మెగాస్టార్ పాటు తేజ్ కూడా పాల్గొంటున్నాడని.. ప్రస్తుతం మామా అల్లుళ్ల మీద సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. శోభిత మాస్టర్ కొరియోగ్రఫీలో చిరు మీద ఇంట్రడక్షన్ సాంగ్ తీస్తున్నారు. ఈ పాటలో మామా అల్లుళ్ళు సందడి చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, విశ్వంభర చిత్రాన్ని యూవి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ 2025లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.