వేలాది మంది కలల్ని కల్లలు చేస్తూ.. వారి ఫ్యూచర్ ను అయోమయం పాలు చేసిన సాహితీ సంస్థ చేసిన మరో ఆరాచకం వెలుగు చూసింది. ఇప్పటికే నమోదైన మోసానికి అదనంగా తాజా మోసం గురించి ఒక బ్యాంక్ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ దుర్మార్గం వెలుగు చూసింది. ఒక వెంచర్ లో ప్లాట్లను కొనుగోలు చేసిన వినియోగదారులతో పాటు.. ప్రాజెక్టుకు లోన్ ఇచ్చిన బ్యాంకును మంచేసిన దారుణం వెలుగు చూసింది.
ఈ వ్యవహారంలో తమకు రూ.323 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదును సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సాహితీ ఇన్ ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు 2018 డిసెంబరులో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి ప్రాజెక్టు ఫైనాన్స్ పేరుతో రూ.65 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. మాదాపూర్ లోని క్రిష్ సపైర్ పేరుతో ఉన్న తమ వెంచర్ లో 160 ప్లాట్లను ఎల్ఐసీకి తాకట్టు పెట్టింది.
కార్తికేయ పనోరమ పేరుతో రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టేందుకు లోన్ కోసం యూకో బ్యాంక్ (సికింద్రాబాద్ బ్రాంచ్) ను అప్రోచ్ అయ్యారు. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కు చెందిన నో అబ్జెక్షన్ పత్రాలతో పాటు లీగల్ ఒపీనియర్.. వాల్యువేషన్ ఆధారంగా పలువురు ప్లాట్ల కొనుగోలుదారులకు 2019 ఆగస్టులో రుణాలు మంజూరు చేశారు.
2021 నవంబరు వరకు సాగిన ప్రాజెక్టు నిర్మాణ పనులు కోర్టు స్టే కారణంగా ఆగాయి. కొత్త రుణాల మంజూరును బ్యాంక్ ఆపేసింది. ఇదిలా ఉంటే ఎల్ఐసీ ప్రతినిధులు సాహితీ చేసిన మోసాన్ని గుర్తించారు. తమకు తాకట్టుపెట్టిన ప్లాట్లనే చూపించి యూకో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నట్లుగా పేర్కొంటూ బ్యాంక్ కు లేఖ రాశారు. అయితే.. 2022 సెప్టెంబరు 15 నాటికి అంతా సర్దిబుచ్చుతామని సాహితీ నిర్వాహకులు చెప్పారు. అయితే.. గడువు ముగిసిన తర్వాత కూడా సాహితీ నిర్వాహకుల నుంచి స్పందన లేకపోవటంతో లీగల్ నోటీసులు జారీ చేశారు.
అయినా.. ఫలితం లేకపోవటంతో కంప్లైంట్ చేశారు.
దీనికి ముందు బ్యాంక్ చేపట్టిన అంతర్గత విచారణలో సాహితీ సంస్థ నిర్వాహకులు చేసిన మోసాన్ని గుర్తించారు. ఒకే ప్లాట్ ను ప్రైవేటు ఫైనాన్షియర్ కు తాకట్టు పెట్టటంతో పాటు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చేసినట్లుగా గుర్తించారు. ఇదే విధానాన్ని పలు ప్లాట్ల విషయంలో ఫాలో అయినట్లుగా తేలింది. ఈ ఎపిసోడ్ లో తమకు రూ.323.64 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా బ్యాంక్ ప్రతినిధులు సీసీఎస్ కు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో సాహితీ నిర్వాహకుల మీద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.