కొద్దిరోజుల క్రితం జరిగిన పురుషుల ఆసియా కప్ లో శ్రీలంక విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అండర్ డాగ్ గా బరిలోకి దిగిన శ్రీలంక అనూహ్యంగా ఫైనల్ కు చేరుకొని బలంగా ఉన్న పాకిస్తాన్ మట్టికరిపించింది. దిగ్గజ ప్లేయర్లు రిటైర్ అయిన తర్వాత క్రికెట్ సంక్షోభం…ఇటీవలి ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా శ్రీలంక జట్టు ఆసియా కప్ ను సొంతం చేసుకున్న వైనంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలోనే తాజాగా మొదలైన టీ20 ప్రపంచ కప్ టోర్నీలో తన తొలి మ్యాచ్ లో పసికూన నమీబియాతో తలపడింది శ్రీలంక. అయితే, ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆసియా కప్ విజేత శ్రీలంక అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ ప్రపంచ కప్ లో అండర్ డాగ్ గా అడుగుపెట్టిన నమీబియా తన తొలి మ్యాచ్ లోనే శ్రీలంకకు గట్టి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి రాణించిన నమీబియా…శ్రీలంకకు 164 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
అయితే, శ్రీలంక జట్టు ఉన్న ఫామ్ ప్రకారం ఇది పెద్ద లక్ష్యం కాదని అంతా అనుకున్నారు. కానీ, కట్టుదిట్టమైన బౌలింగ్ తో లంక జట్టును నమీమియా మట్టికరిపించింది. దీంతో, మరో ఓవర్ మిగిలి ఉండగానే 108 పరుగులకు శ్రీలంక కుప్పకూలింది. ఈ క్రమంలోనే నమీబియా సాధించిన విజయంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. ఈ విజయం ద్వారా తన పేరు గుర్తు పెట్టుకోవాలంటూ నమీబియా క్రికెట్ జట్టు ప్రపంచానికి చాటి చెప్పిందని సచిన్ ట్వీట్ చేశారు.
తొలి మ్యాచ్ లోనే అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న నమీబియా ఈ టోర్నీలో మరిన్ని జట్లకు షాక్ ఇచ్చి క్వాలిఫై అయినా ఆశ్చర్యపోనవసరం లేదని పలువురు క్రీడాభిమానులు, క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.