ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దమనకాండను ప్రపంచంలోని చాలా దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. తమకంటే బలహీనమైన ఉక్రెయిన్ పై అత్యంత బలమైన రష్యా దాడి చేయడాన్ని నిరసిస్తున్నాయి. అంతేకాదు, రష్యా తీరుకు నిరసనగా చాలా దేశాలు రకరకాల చర్యలు చేపట్ట ిఆ దేశాన్ని సమాజం దృష్టిలో దోషిగా బోన్ లో నిలబెట్టాయి. అయితే, ఉక్రెయిన్ కు మద్దతుగా రష్యాపై ఏవైనా దేశాలు దాడి చేయాలన్న ఆలోచన కూడా రానివ్వొద్దని రష్యా హెచ్చరిస్తోంది.
అంతేకాదు, మూడో ప్రపంచ యుద్ధమంటే అణు యుద్ధమేనని, రష్యాపై దాడి అంటూ జరిగితే…ఆటోమేటిక్ గా ప్రపంచ దేశాలన్నింటినీ నాశనం చేయగలిగే బ్రహ్మాస్త్రం తమ దగ్గరుందని వార్నింగ్ ఇస్తోంది. ‘డెడ్ హ్యాండ్’ అలియాస్ ‘పెరిమీటర్’ అనే ఆటోమేటిక్ అణ్వాయుధ వ్యవస్థను అస్త్రంగా తాము ప్రయోగిస్తే ప్రపంచపటంలో ఏ దేశమూ మిగలదని హెచ్చరిస్తోంది. పొరపాటున రష్యాపై ఎవరైనా దాడి చేస్తే, ఆ సమయానికి అణ్వాయుధాలను అధికారులు కూడా యాక్టివేట్ చేయలేని పరిస్థితులు వస్తే…దానతంట అదే ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయ్యేలాగా ఈ డెడ్ హ్యాండ్ ను రూపొందించింది రష్యా.
రష్యా నాశనమైన మరుక్షణం ఆటోమేటిక్ గా రష్యాలోని అణ్వాయుధాలను అణ్వాయుధాలను మిగతా దేశాలపై లాంచ్ చేసే శక్తి డెడ్ హ్యాండ్ కు ఉంది. ప్రపంచ వినాశనాన్ని శాసించే డెడ్ హ్యాండ్ వంటి వినాశకర ఆటోమేటిక్ అణ్వస్త్ర వ్యవస్థ కేవలం రష్యా దగ్గర మాత్రమే ఉంది. తమ దగ్గర ఈ బ్రహ్మాస్త్రం ఉందని 2011లో అప్పటి రష్యా కమాండర్ సెర్గీ కరాకయీవ్ అధికారికంగా ప్రకటించారు. ఇక, కొన్నేళ్ల క్రితం దానిని రష్యా అప్ గ్రేడ్ చేయడంతో అది మునుపటికన్నా శక్తిమంతంగా మారిందని తెలుస్తోంది.
అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు కమాండ్లు ఇచ్చే 700 వెహికల్స్ ఆ వ్యవస్థలో ఉన్నాయట. అయితే, మాస్కోలోని భూగర్భ బొరియల్లో దానిని దాచామని రష్యా చెబుతోంది..కానీ, అది వేరేచోట ఉందని టాక్. రష్యాపై అణ్వాయుధ ప్రయోగం జరిగితే దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రేడియేషన్ తీవ్రతను సైనికాధికారులకు డెడ్ హ్యాండ్ తెలియజేస్తుంది. ఒకవేళ వారు ప్రమాదంలో పడి వారి నుంచి ఎలాంటి ఆదేశాలు అందకపోతే కొద్దిసేపటి తర్వాత ఆటోమేటిక్ గా ఆర్డర్స్ ఇచ్చేస్తుంది.