ప్రపంచ దేశాలపై రెండో ప్రపంచ యుద్ధం ప్రభావం ఎంతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. సెకండ్ వరల్డ్ వార్ పేరు చెప్పగానే గుర్తొచ్చే మొదటి పేరు హిట్లర్. 1939లో పోలెండ్‌పై జర్మనీ దాడితో ఆరంభమైన యుద్ధం…1945లో జర్మనీ రాజధాని బెర్లిన్ నగరాన్ని సోవియట్ యూనియన్ సేనలు ఆక్రమించుకోవడం, హిట్లర్ ఆత్మహత్య వంటి పరిణామాలతో ముగిసింది. అయితే, రెండో ప్రపంచ యుద్ధానికి పురుడుపోసిన హిట్లర్ చరిత్రలో విలన్‌గా నిలిచిపోయాడు.
కానీ, ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. జర్మనీపై యుద్ధం సందర్భంగా జర్మన్ మహిళలపై రష్యా సైన్యం చేసిన పాశవిక చేష్టలు…హిట్లర్ చర్యల కన్నా దారుణమన్న సత్యం చరిత్రలో మరుగన పడిందంటున్నారు చరిత్రకారులు. బెర్లిన్ను ఆక్రమించుకునేందుకు వచ్చిన రష్యా సేనలు.. జర్మనీ మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. తమపై తిరగబడిన మహిళలతో పాటు…బెర్లిన్ వదిలి పారిపోవాలనుకున్న మహిళలపై కూడా వారు దారుణాలకు ఒడిగట్టారని కొందరు ఆరోపిస్తుంటారు. 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు…మహిళలు ఎవరు కనిపించినా వదల్లేదని చెబుతుంటారు.
అయితే ఈ ఘటనలను అప్పట్లో రష్యా మీడియా కొట్టిపారేసింది. అదంతా బూటకమే అని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఉక్రెయిన్‌కు చెందిన వ్లాదిమిర్ జెల్ఫాండ్ అనే రష్యన్ సైన్యపు లెఫ్టినెంట్ తన డైరీలో రష్యా సేనల ఆగడాల గురించి రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డైరీలు రాయడంపై రష్యా ఆంక్షలు విధించినప్పటికీ… వ్లాదిమిర్ జెల్ఫాండ్ మాత్రం రహస్యంగా తన డైరీలో 16 ఏప్రిల్ 1945 నుంచి 2 మే 1945 వరకు బెర్లిన్ నగరాన్ని ఆక్రమించుకునే క్రమంలో ఏం జరిగిందో రాశారు. ఇటీవల జెల్ఫాండ్ తనయుడు విటలీ జెల్ఫాండ్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించడంతో అవి ప్రపంచం ముందుకు వచ్చాయి.