2009లో ‘టైటానిక్’ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అద్భుతం ‘అవతార్’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కామెరూన్ పదేళ్ల కష్టానికి ప్రతిరూపంగా థియేటర్లలోకి వచ్చిన ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ప్రపంచ సినీ చరిత్రలో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఆల్ టైం రికార్డ్ బ్లాక్ బస్టర్ గా ఆ సినిమా చరిత్రపుటల్లో నిలిచిపోయింది. కట్ చేస్తే..దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆ చిత్రం సీక్వెల్ అవతార్-2 సినిమాతో మరోసారి ప్రేక్షకులను తన మాయాలోకంలోకి తీసుకువెళ్లేందుకు వచ్చాడు కామెరూన్.
రూ.3 వేల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ విజువల్ వండర్ ఫ్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే, అవతార్ తో పోలిస్తే ఈ చిత్రానికి కొంత మిక్స్ డ్ టాక్ వస్తోంది. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇది పూర్తిగా గ్రాఫిక్స్ బేస్డ్ మూవీ కావడంతో టూడీ వెర్షన్ కన్నా త్రీడీ వెర్షన్ లో చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.
కానీ, మన దేశంలో అన్ని త్రీడీ థియేటర్లు, స్క్రీన్లు లేకపోవడంతో కలెక్షన్లపై ప్రభావం పడుతోందట. అందుకే, మన దేశంలో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ తొలి రోజు కలెక్షన్ల రికార్డును ఈ చిత్రం దాటలేదు. అయితే, కామెరూన్ మాయా ప్రపంచంలోకి వెళ్లిన ప్రేక్షకులు మంచి అనుభూతి పొందుతున్నారు. కానీ, 3 గంటల 12 నిమిషాల నిడివి ఉండడంతో ప్రేక్షకుల ఓపికకు అవతార్-2 పరీక్ష పెడుతోందట. మొత్తం మీద ఒక అరగంట రన్ టైం కట్ చేస్తే ఇటు ప్రేక్షకులు, ఎక్స్ ట్రా షోలు వేసుకుంటూ అటు ఎగ్జిబిటర్లు హ్యాపీగా ఉంటారట.
విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అవతార్ అద్భుతం అని, కానీ, అవతార్-2లో అత్యాధునిక టెక్నాలజీ వాడినా…అవతార్ సినిమా ఫీల్ రాలేదని కొందరు అంటున్నారు. స్క్రీన్ ప్లే కొంత నెమ్మదిగా ఉండడం కూడా ఈ జనరేషన్ వారికి నచ్చడం లేదట.