కారు చౌకకే మొబైల్ డేటా….స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఓ రకంగా సమాచార విప్లవం మొదలైందని చెప్పవచ్చు. ఈ టెక్ జమానాలో నిజం తాబేలులా నడుచుకుని వెళ్లి చివరకు విజయం సాధించినా….ఫేక్ న్యూస్, వదంతులు కుందేలులా వేగంగా పరిగెత్తి అసలుసిసలు సమాచారం ముందు బొక్కబోర్లా పడతాయి. సోషల్ మీడియా వాడకం ఎక్కువైన తర్వాత ఏది రియల్..ఏది వైరల్ అని తెలుసుకోవడం కష్టంగా మారింది.
ఈ కోవలోనే తాజాగా ఓ వార్త ఇటు కొన్ని మీడియా చానెళ్లతోపాటు అటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గుంటూరు జిల్లా తాడికొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవికి కరోనా సోకిందని, ప్రస్తుతం ఆమెకు సీరియస్ గా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
కరోనా గురించి శ్రీదేవి నిర్లక్ష్యం చేయడంతో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఉండవల్లి ఆరోగ్యంపై ఆమె కార్యాలయ సిబ్బంది స్పందించారు.శ్రీదేవి ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఎమ్మెల్యే కార్యాలయం ఖండించింది. ఎమ్మెల్యే శ్రీదేవికి కరోనా పాజిటివ్ అని, కానీ, ఆమెకు సీరియస్ గా ఉందన్న మాట నిజం కాదని తెలిపింది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోగ్యం నిలకడగానే ఉందని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శ్రీదేవి చికిత్స తీసుకుంటున్నట్లు వివరించారు. త్వరలోనే ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోగ్యంతో తిరిగి వస్తారని.. అభిమానులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.