అధికారంలో ఉన్నా లేకపోయినా ఫైర్ బ్రాండ్ రోజా అనే పేరు ఆమెకు. సినిమాల్లో ఉన్నా లేకపోయినా ఇప్పటికీ ఆమె తన సంబంధ బాంధవ్యాలు ఆ రంగంలో కొనసాగిస్తూనే ఉంటారు. ఓ విధంగా బీఏ డిస్ కంటిన్యూ చేసి ఇటుగా వచ్చి నటిగా రాణించి మంచి మార్కులు కొట్టేసిన రోజా తక్కువ కాలంలోనే అగ్ర హీరోలతో నటించి పేరు తెచ్చుకున్నారు. తరువాత టీడీపీ గూటికి చేరి అక్కడ కూడా బాగానే రాణించారు. ఏవో కొన్ని కారణాల రీత్యా అనూహ్యంగా జగన్ పార్టీలో చేరాక 2014 నుంచి ఇప్పటిదాకా తిరుగులేని హవాతోనే వెళ్తున్నారు.
ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డిని విమర్శించిన నోరే ఇవాళ ఆ పెద్దాయనను పొగుడుతోందని టీడీపీ అనేది ఇందుకే ! ఇక పదవి రానంత వరకూ తనకు తన కుటుంబానికి జబర్దస్త్ అనే కార్యక్రమమే ఆధారం అని చెప్పిన రోజా, మంత్రి పదవి రాగానే స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఖరీదయిన కారు కొనుగోలు చేశారు. విలాసవంతం అయిన జీవితాన్నే గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ఏపీఐఐసీ చైర్మన్ గా ఏమీ సంపాదించకపోయినా, మంత్రిగా మాత్రం మంచి దర్పాన్నే వెలగబెడుతున్నారని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. టీడీపీ కూడా ఇవే తరహా విమర్శలు చేస్తోంది.
కోటిన్నర విలువ చేసే బెంజి కారు కొనుగోలు చేశారు రోజా. ఏపీ టూరిజం శాఖ మంత్రిగా ఉన్నా రోజా సెల్వమణి తన కొత్త కారు చూసి మురిసిపోతూ ఉన్నారు. తన కొడుకు కోరిక తీర్చానని కూడా అంటున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా అంత డబ్బు మంత్రి పదవి వచ్చిన వెంటనే వచ్చేసిందా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. టూరిజం శాఖ మంత్రిగా లెక్కా పద్దూ లేకుండా కొన్ని ఖర్చులు చేస్తూ ఉన్నారంటూ విమర్శలు కూడా వస్తున్నాయి.
వీటిపై కూడా ఆమె మాట్లాడాల్సి ఉంది. వాస్తవానికి తనకు ఆర్థిక క ష్టాలు ఉన్నాయని (ఓ అంచనా ప్రకారం ఇరవై లక్షలకు పైగా అప్పు ఉందని, ఏడు కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయని తెలుస్తోంది) చెప్పుకువచ్చారు. అంతేకాదు తన భర్త తీసిన సినిమా కారణంగానే తాను బోలెడు డబ్బు పోగొట్టుకున్నానని కూడా చెప్పారామె. తన ఇంటి కష్టాలు చెబుతూ ఓ సందర్భంలో ఈటీవీ ప్రొగ్రాంలో కన్నీటి పర్యంతం అయ్యారు. కానీ పదవి అందుకున్న కొద్ది నెలలకే ఆమె ఖరీదయిన కారు కొనుగోలు చేయడం వెనుక కారణం ఏమయి ఉంటుంది అన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఎపార్ట్ ఫ్రమ్ దిస్ .. ప్లీనరీలో రోజా చేసిన వ్యాఖ్యల కారణంగా టీడీపీ కన్నా వైసీపీనే ఎక్కువ ఇరకాటంలో పడిపోయింది. ఆమెను ఉద్దేశించి రేపటి వేళ టీడీపీ మాట్లాడే మాటలకు తాము ఎలా కౌంటర్లు ఇవ్వాలని తలలు పట్టుకుంటున్నారు. ఆమె టీడీపీని జంబలకిడి పంబ పార్టీ అని అంటూ ఏకేశారు. ఇదే ఇప్పుడు పెను సంచలనం అవుతోంది. ఇప్పటిదాకా టీడీపీ నాయకులు వీటికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వలేదు కానీ ఇస్తే, ఆమె ఏ విధంగా జవాబిస్తారో చూడాలిక. మరోవైపు తమది అవినీతి లేని పార్టీ అని వైసీపీ నాయకులు అంటున్నారు కదా! మరి ! రోజా వ్యక్తిగత సహాయకుల దందా సంగతేంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నాయకులు.