మహలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసే అవకాశం కల్పించటం ఆటోడ్రైవర్లు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం హద్దులు దాటింది. తాజాగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై ఆటో డ్రైవర్లు దాడి చేసిన వైనం సంచలనంగా మారింది. ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొత్తగేూడెం డిపో నుంచి మధ్యాహ్నం ఖమ్మం బయలుదేరిన పల్లెవెలుగు బస్సు కొత్తగూడెం పట్టణంలోని పోస్టాఫీసు కూడలికి చేరుకుంది. అప్పటికే షేర్ ఆటోలో ఎక్కిన పలువురు మహిళలు ఆర్టీసీ బస్సు వచ్చినంతనే.. అందరూ బస్సుల్లోకి ఎక్కారు. దీంతో.. ఆగ్రహానికి గురైన ఆటోడ్రైవర్లు బస్సు డ్రైవర్ మీద దాడికి దిగారు. పెద్ద ఎత్తున ధూషిస్తూ దాడికి పాల్పడటం గమనార్హం.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ నాగరాజుపై నీళ్లు జల్లుతూ.. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. అతడిపై దాడికి పాల్పడ్డారు. తోటి ప్రయాణికులు.. కండక్టర్ సరస్వతి వారించే ప్రయత్నం చేసినా ఊరుకోలేదు. దీంతో.. ఈ దారుణంపై కొత్తగూడెం డిపో మేనేజర్ కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతపై పలువురు మండిపడుతున్నారు.
ఆటో డ్రైవర్లతీరు సరికాదంటున్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణంతో తమ ఉపాధి అవకాశాలు దెబ్బ తిన్నాయన్నదే వారి వాదన అయితే.. ఒకపద్దతి పాడు లేకుండా వసూళ్లకు పాల్పడే వైనం సంగతి ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న మాట వినిపిస్తోంది.