మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా మర్డర్ మిస్టరీ ఇంకా చిక్కుముడిగానే ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సునీల్ యాదవ్ సహా కొందరి పేర్లు బయటకు వచ్చినా…అసలు సూత్రధారులు తెరపైకి రాలేదన్న ప్రచారం జరుగుతోంది. వివేకా హత్య కేసు విచారణలో భాగంగా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర రెడ్డిని ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిపిన సీబీఐ…తాజాగా దూకుడు పెంచింది.
వివేకా కేసుకు సంబంధించి సీబీఐ కీలక ప్రకటన చేసింది. ఈ కేసుకు సంబంధించి నమ్మకమైన సమాచారం అందించిన వారికి రూ.5లక్షలు నజరానా ఇస్తామని సీబీఐ ప్రకటించింది. అంతేకాదు, ఆ వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా సీబీఐ అధికారులు హామీ ఇస్తున్నారు. వివేకా హత్య గురించి తెలిసిన సామాన్యులు ముందుకు వచ్చి సమాచారమివ్వాలని వారు కోరుతున్నారు. డిఎస్పీ దీపక్ గౌర్ (011-24368646, 9474256974), ఎస్పీ రామ్‌సింగ్ (011-24368649, 9988272709) లను కార్యాలయంలో కానీ, ఫోన్ ద్వారా కానీ సమాచారమివ్వదలిచినవారు సంప్రదించవచ్చని సీబీఐ ప్రకటనలో తెలిపింది.
అంతకుముందు, కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్‌లో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. వైఎస్ భాస్కర్ రెడ్డినికూడా రెండుసార్లు సీబీఐ విచారణ జరిపింది. ఇక, సీబీఐ అధికారులతో వైఎస్ వివేకా కుమార్తె సునీత దాదాపు 4 గంటలకు పైగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, కొందరు సాక్షులు భయపడుతున్నారని, అందుకే ముందుకు వచ్చి సమాచారం ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రూ. 5 లక్షల నజరానా అంటూ సీబీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మరి, ఈ ఆఫర్ కు టెంప్ట్ అయ్యి ఎవరన్నా ముందుకు వచ్చి సమాచారమిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.