వైసీపీ నేతలపై, సీఎం జగన్ పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిత్యం విషం చిమ్ముతుంటారని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తుంటాయి. జగన్ ను టార్గెట్ చేసి టీడీపీకి అనుకూలంగా ఎల్లో మీడియా లీడర్ లా వ్యవహరిస్తుంటారని ఆయనను వైసీపీ నేతలు విమర్శిస్తుంటారు. అంతెందుకు, మనం పోరాడాల్సింది చంద్రబాబు, టీడీపీతో కాదు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 వంటి మీడియా సంస్థలు, వాటి యాజమాన్యాలతో అని సాక్ష్యాత్తూ సీఎం జగనే తన పార్టీ నేతల అంతర్గత సమావేశంలో అన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, రాధాకృష్ణను, ఆయన పత్రికను వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే టార్గెట్ చేశారన్న సంగతి మాత్రం అతికొద్ది మందికే తెలుసు. ఆ తర్వాత వైఎస్ కుటిల రాజకీయాలను ఆర్కే దీటుగా ఎదుర్కొని ….గోడకు కొట్టిన బంతిలా మరింత బలంగా రీఎంట్రీ ఇచ్చారన్న సంగతి చాలామందికి తెలీదు. ఇక, తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న జగన్….ప్రతిపక్ష నేతగా ఉన్న సమయం నుంచే ఆర్కేను టార్గెట్ చేశారు. తన ప్రెస్ మీట్లకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు రావొద్దంటూ బహిరంగంగా బాయ్ కాట్ చేశారు. ఇక, సీఎం అయిన తర్వాత ఏబీఎన్ చానెల్ ను కొన్ని ప్రాంతాల్లో టెలికాస్ట్ కాకుండా చేశారు.
ఈ నేపథ్యంలోనే తాజగా జగన్ కక్షా రాజకీయాలు, రాజీ కోసం బేరసారాలపై ‘కొత్త పలుకు’లో ఆర్కే తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం అయిన తర్వాత తన సొంత మీడియా సంస్థకు జగన్ రూ.300 కోట్ల ఆదాయాన్ని ప్రకటనల రూపంలో దోచిపెట్టారని ఆర్కే ఆరోపించారు. దేశ చరిత్రంలో ఇంత భారీ మొత్తంలో ప్రకటనల కోసం ఖర్చు చేయడం ఇదేనని ఆర్కే అన్నారు. ఈ మూడేళ్లలో ‘ఆంధ్రజ్యోతి’ పత్రికకు ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా జగన్ సర్కార్ ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నారని ఆర్కే ఆరోపించారు.
అయినా ఏనాడూ తాము ప్రకటనల కోసం జగన్ ప్రభుత్వాన్ని దేబిరించలేదని, తనకు ఇష్టమైన పత్రికలకు మాత్రమే ప్రకటనలిచ్చినా పట్టించుకోలేదని అన్నారు. ఈ మూడేళ్లలో తమ పత్రికకు ప్రభుత్వం తరఫున రావాల్సిన దాదాపు 250 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయామని, అయినా మడమ తిప్పలేదని అన్నారు. రాజీకోసం ఎంతమందితో రాయబారం నడిపినా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో తమ వైఖరి మార్చుకోలేదని అన్నారు.
జగన్రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనం అవుతోందని తాము బలంగా నమ్ముతున్నామని, ఎన్నికలకు ముందే ఇదే విషయాన్ని చెప్పినా జగనే ముద్దు అనుకున్న వాళ్లు ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు. జగన్తో తమకేమీ ఆస్తుల పంచాయితీ లేదని, ప్రభుత్వ పోకడల వల్ల రాష్ట్ర విశాల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నదే నాడు–నేడు తమ ఆవేదన అని చెప్పారు. అందుకే జగన్రెడ్డి వంటి నియంతతో నిలబడి కలబడుతున్నామని, పర్యవసానాల గురించి ఆలోచించే అలవాటు తమకు ఎప్పుడూ లేదని వెల్లడించారు.
కొన్ని మీడియా సంస్థలే తనకు పోటీ అంటున్న జగన్రెడ్డి, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆత్మపరిశీలన చేసుకున్నారా? అని ఆర్కే నిలదీశారు. తన గురించి తన సొంత మనుషులు ఏమనుకుంటున్నారో తెలుసుకొనే ప్రయత్నం కూడా జగన్ చేయలేదని దుయ్యబట్టారు. తల్లీ చెల్లీ దూరమవడానికి తాము కారణం కాదని, షర్మిలకు ఆస్తిలో వాటా ఇవ్వడానికి జగన్రెడ్డి నిరాకరించిన వ్యవహారంతోనూ తమకు సంబంధం లేదని అన్నారు. సొంత బాబాయిని చంపింది ఎవరో, చంపించింది ఎవరో తేటతెల్లమైన తర్వాత కూడా నిందితుల తరఫున జగన్రెడ్డి వకాల్తా పుచ్చుకోవడానికి మీడియా కారణం కాదంటూ ఆర్కే తన మార్క్ చురకలంటించారు.