సాధారణంగా ప్రత్యేక పరిస్థితుల్లో వైద్య సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులను కేటాయిస్తుంటారు. అది కూడా, సీఎంఆర్ఎఫ్ కు సదరు రోగి లేదంటే రోగి కుటుంబ సభ్యులు అభ్యర్థన పెట్టుకుంటే దానిని పరిశీలించి నిధులను విడుదల చేస్తారు. అయితే, తాజాగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న నటుడు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ చికిత్స కోసం ఏపీ సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.17లక్షలు విడుదల కావడం చర్చనీయాంశమైంది.
కత్తి మహేశ్ చికిత్స కోసం ఏపీ సర్కార్ భారీ ఆర్థికసాయం ప్రకటించింది. రూ.17లక్షలను చెన్నై అపోలో ఆస్పత్రి ఖాతాలో జగన్ సర్కార్ జమ చేసింది. ఈ ప్రకారం సీఎం స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే, మహేశ్ తరఫున ఎవరన్నా సీఎంఆర్ఎఫ్ కు అభ్యర్థన పెట్టుకుంటే నిధులు విడుదల చేశారా ..లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
కాగా, 2019 ఎన్నికలకు ముందు నుంచి వైసీపీకి సానుభూతిపరుడిగా కత్తి మహేశ్ ఉంటోన్న సంగతి తెలిసిందే. గతంలో పవన్ కల్యాణ్ పై విమర్శల నేపథ్యంలో మహేశ్ వెనుక వైసీపీ ఉందని విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మహేశ్ కు జగన్ సర్కార్ భారీగా సాయం చేయడం చర్చనీయాంశమైంది. ఇలాగే జగన్ అందరికీ సాయం చేస్తాడా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మరోవైపు, మహేశ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఆయన కోలుకుంటారని వైద్యులు చెప్పిన సంగతి తెలిసిందే.