తన, మన…పేద, ధనిక…భేదాలేవి చూడని కరోనా మహమ్మారి ఎందరినో పొట్టనబెట్టుకుంటోంది. ఈ మాయదారి వైరస్ బారినపడిన వారు చికిత్స పొందుతున్నప్పుడు అనుభవించే వేదన ఒక ఎత్తయితే…కాలం, ఖర్మం కలిసిరాక కరోనాతో మహమ్మారి కాటుకు బలై చనిపోయిన తర్వాత కూడా శవాలుగా మారిన తర్వాత కూడా వారి వేదన మరో ఎత్తు. కరోనాతో చనిపోయిన కొందరి అంత్యక్రియలలు అనాథ శవాలుగా జరుగుతున్న వైనం పలువురిని కలచివేస్తోంది.
ఇక, కరోనాతో చనిపోయిన కొందరు నిరుపేదలు, మధ్య తరగతివారి అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి కుటుంబసభ్యులు పడుతున్న యాతన వర్ణనాతీతం. అంబులెన్స్ ఖర్చులు మొదలు శ్మశానంలో అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం శోచనీయం. ఈ నేపథ్యంలోనే కోవిడ్ తో మరణించిన వ్యక్తుల అంత్యక్రియలను ప్రభుత్వాలే నిర్వహించాలని, దానికి సంబంధించిన ఖర్చులను భరించాలని విమర్శలు చెలరేగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ మూలంగా చనిపోయిన వ్యక్తుల అంత్యక్రియల కోసం 15 వేల రూపాయలను మంజూరు చేస్తూ జీవో నెం 236ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ జారీ చేశారు. అంతిమ సంస్కారాలకు అవసరమైన నిధులను విడుదల చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించిందని జీవోలో పేర్కొన్నారు.