అమ్మఒడి పథకాన్ని తమ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. అయితే, అమ్మఒడి పథకం ద్వారా తమ పిల్లల్ని బడికి పంపే తల్లుల ఖాతాలో ఏటా రూ.15వేలు జమ చేస్తామన్న జగన్…మొదటి ఏడాది అలానే చేశారు. కానీ, రెండో ఏడాది మాత్రం బడుల్లో మరుగు దొడ్ల నిర్వహణ పేరుతో రూ.1000 మినహాయించి రూ.14వేలు మాత్రమే జమ చేశారు.
ఆ వెయ్యి రూపాయలను మరుగుదొడ్ల నిర్వహణ కోసం పాఠశాల ఖాతాలో జమచేస్తామని చెప్పిన ప్రభుత్వం…ఆరు నెలలు గడిచినా అజాపజా లేదు. విద్యార్థుల సంఖ్య ప్రకారం ప్రతి బడిలో రూ.6వేల జీతానికి ఒక స్కావెంజర్ ను నియమించారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు తెరవకపోయినా వారికి సగం జీతం ఇవ్వాల్సిందే. అయితే, మరుగుదొడ్లు బాగోలేకుంటే… సంబంధిత ప్రధానోపాధ్యాయులను బాధ్యుల్ని చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో నిధులు రాకపోయినా…ప్రధానోపాధ్యాయులు తమ జేబులో నుంచి ఆ డబ్బును ఖర్చు చేస్తున్నారు.
ఇలా ఒక చిత్తూరు జిల్లాలోనే అన్ని పాఠశాలలకు కలిపి రూ.15.58 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని డీఈవో, జేసీల పేరుమీద జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఆ పని చేయలేదు. ఇప్పటికే చాలామంది ప్రధానోపాధ్యాయులు తమ జేబులో నుంచి డబ్బు ఖర్చు పెట్టి ..ఆ బిల్లులను సీఎఫ్ఎంఎస్ కు పంపించారు. ఇప్పటికే మూడు నెలలు గడిచినా అవి ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలోనే ఆ వెయ్యి ఏమైనట్టన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.