తెలంగాణ రాజకీయాల్లో కోకాపేట భూముల స్కామ్ కాక రేపుతోన్న సంగతి తెలిసిందే. ఆ భూముల వేలంలో వేలకోట్ల రూపాయల అవినీతి జరిగిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆ వ్యవహారంలో అధికార పార్టీ నేతల హస్తముందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్కామ్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోకాపేట భూముల వేలంలో రూ.1000 కోట్ల స్కామ్ జరిగిందని షాకింగ్ కామెంట్లు చేశారు.
అంతేకాదు, ఈ స్కామ్ వెనుక టీఆర్ఎస్ నేతల హస్తముందని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. హెచ్ఎండీఏ భూముల వేలంతో రూ.3 వేల కోట్లు రావాల్సి ఉండగా…రూ.2 వేల కోట్లు మాత్రమే వచ్చాయని అన్నారు. ఆ వెయ్యి కోట్లు ఏమయ్యాని రేవంత్ ప్రశ్నించారు. ఆ దోపిడీ ఎలా జరిగిందో, అందులో ఎవరున్నారో, ఎవరు ఎవరికి బినామీలో రేపు చెబుతానని బాంబు పేల్చారు. ఎవరినీ వేలంలోకి రాకుండా చేశారని మండిపడ్డారు.
ఒక్కో ఎకరం రూ.60 కోట్లకు పోవాల్సి ఉందని, కానీ, ఒక్కో ఎకరం ఒక్కో రేటుకు విక్రయించారని ఆరోపించారు. ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు ఎవరికి చుట్టాలు? ఎవరి అనుచరులు? అధికార పార్టీ ఎంపీలు..ఎమ్మెల్సీలకు వాటిని ఎలా ఇచ్చారు అన్నది బయటపెడతానని చెప్పారు. కాళ్ళు మొక్కిన వారికి భూములు ఎలా ఇచ్చారో, గంటల వ్యవధిలో టీఆర్ఎస్ వాళ్లు వెయ్యి కోట్లు ఎలా జుర్రకున్నారో బండారం బయటపెడతానని షాకింగ్ కామెంట్లు చేశారు.