మొబైల్ ఫోన్ల తయారీలో శాంసంగ్ కంపెనీకి మంచి పేరున్న సంగతి తెలిసిందే. చైనాకు చెందిన వివో, ఒప్పో, రియల్ మీ, షామీ వంటి బ్రాండ్లు మార్కెట్లోకి రాకముందు శాంసంగ్ ఫోన్ ఎక్కువగా సేల్ అయ్యేది. మార్కెట్లో అధికంగా ఫ్లాగ్ షిప్ సెగ్మెంట్లో ఫోన్లను, స్మార్ట్ ఫోన్లను విడుదల చేసే శాంసంగ్ ఆ తర్వాత చైనా కంపెనీల ధాటికి కాస్త నెమ్మదించింది. శాంసంగ్ కన్నా చౌక ధరలకే ఆ ఫోన్లు రావడంతో శాంసంగ్ మార్కెట్ పడిపోయింది.
అయితే, ఇటీవల కాలంలో సరికొత్త మోడల్ తో పాటు బడ్జెట్ రేంజ్ లో స్మార్ట్ ఫోన్ లను శాంసంగ్ విడుదల చేయడం మొదలుపెట్టింది. మార్కెట్లో గత వైభవాన్ని సొంతం చేసుకునేందుకు శాంసంగ్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో పలు మోడళ్లలో స్మార్ట్ ఫోన్లను శాంసంగ్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు పెట్టిన ఫెస్టివల్ ఆఫర్స్ లో శాంసంగ్ ఫోన్లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.
దసరా పండుగ సందర్భంగా ఆ దిగ్గజ ఈ కామర్స్ సైట్లు ఆదివారం ఒక్కరోజే దాదాపు 1000 కోట్ల విలువైన శాంసంగ్ ఫోన్లను అమ్మడం విశేషం. ఆదివారంనాడు దాదాపు 12 లక్షల శాంసంగ్ ఫోన్లను ఆ రెండు ఈ కామర్స్ సంస్థలు విక్రయించాయి. ఫెస్టివల్ సేల్స్ లో భాగంగా శాంసంగ్ డిస్కౌంట్లు ప్రకటించింది. బడ్జెట్ రేంజ్ లో 4జీ, 5జీ ఫోన్లను విడుదల చేసి రాయితీలు ప్రకటించింది. దీంతో, ఆ ఆఫర్లకు తగ్గట్టుగా భారీ స్థాయిలో వ్యాపారం చేసింది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్20, ఎఫ్ఈ 5జీ, గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎం53, గెలాక్సీ ఎం33, గెలాక్సీ ఎం 32 ప్రైమ్ ఎడిషన్, గెలాక్సీ ఎం 13 మోడళ్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. వాటిలో శాంసంగ్ గెలాక్సీ ఎం 13 బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా అగ్రస్థానంలో నిలిచింది. మిడ్ రేంజ్లో ఈ మోడల్ నుంచి 5జీ ఫోన్ రావడంతో…వినియోగదారులు దానిని ఎక్కువగా కొనుగోలు చేశారు. 4జీ నెట్వర్క్ 4జీబీ ర్యామ్/ 64 జీబీ వేరియంట్ ధర రూ. 9,499 కాగా, 5జీ నెట్వర్క్ 4జీబీ/64 జీబీ వేరియంట్ ధర రూ. 11,499.